అస్సాంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లాం శనివారం ఉదయం పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నాడు. నాగావ్ జిల్లాలోని డింగ్ వద్ద చెరువులో దూకి మరణించిన విషయం తెలిసిందే. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశామని.. తెల్లవారుజామున 3.30 గంటలకు ‘క్రైమ్ సీన్’ని విచారించడానికి నేరస్థలానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తఫ్జుల్ ఇస్లాం పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని చెరువులో దూకాడని పేర్కొన్నారు. వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. సుమారు రెండు గంటల తర్వాత అతని మృతదేహాన్ని వెలికితీశారు.
READ MORE: AP Weather: ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు!
నిందితుడి సొంత గ్రామమైన బోరభేటి ప్రజలు కీలక తీర్మానం చేశారు. అంత్యక్రియలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. గ్రామంలో మృతదేహానికి ఖననం చేయడానికి అనుమతించమని పేర్కొన్నారు. “ఈ నేరస్థుడి అంత్యక్రియలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాం.. అతని కుటుంబాన్ని కూడా గ్రామం నుంచి వెలివేశాం. నేరస్థులతో కలిసి జీవించలేం” అని స్థానిక నివాసి సక్లైన్ ఓ జాతీయ మీడియా సంస్థతో పేర్కొన్నారు. మరో స్థానికుడు అసదుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ.. “మా గ్రామస్థుడు ఇలాంటి చర్యకు పాల్పడటం సిగ్గు చేటుగా భావిస్తున్నాం. నేరస్థుడు చనిపోయాడని తెలియగానే, అతని మృతదేహాన్ని మా స్మశానవాటికలో ఉంచకూడదని నిర్ణయించుకున్నాం. అతడి అంత్యక్రియలకు కూడా గ్రామస్థులెవరూ హాజరు కారు” అని తెలిపారు.
READ MORE:Janhvi Kapoor: పుష్ప 2 ఐటమ్ సాంగ్ కి అడ్డుగా దేవర కాంట్రాక్ట్.. కానీ?
కాగా.. ముగ్గురు నేరస్థులు అమాయకపు చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ట్యూషన్ నుంచి తిరిగి వస్తున్న 10వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను రోడ్డు పక్కన పారేశారు. బాధితురాలు బట్టలు లేకుండా ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన తర్వాత అస్సాంలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. బాధితురాలిని నాగావ్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో చేర్చారు. మైనర్‌పై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు మరణించాడు.
