AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్‌లో నిలిచిన పోలింగ్!

Vijayawada Municipal Elections

Vijayawada Municipal Elections

Ballot Symbol Mix-Up in Old Rajarajeswari Peta: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణ పొరపాటు కలకలం రేపింది. నగరంలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓల్డ్ రాజరాజేశ్వరి పేట 55వ డివిజన్‌లో అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఎన్నికల గుర్తులు తారుమారుగా ముద్రితమయ్యాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు వెంటనే స్పందించి ఆ డివిజన్‌లో పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరుకు ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన హస్తం ముద్రించారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు పక్కన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన ఫ్యాన్‌ను ముద్రించారు.

బ్యాలెట్ పేపర్లలో ఈ పొరపాటును గుర్తించిన వైసీపీ అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) చక్రవర్తి స్పందించి 55వ డివిజన్‌లో పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యాలెట్ పేపర్లలో తప్పులను సరిదిద్ది కొత్తగా ముద్రించిన తర్వాతే ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కొత్త బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటల తర్వాత తిరిగి పోలింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బ్యాలెట్ పేపర్లలో గుర్తులు మారిపోవడంతో ఎన్నికల నిర్వహణలో అధికారుల అప్రమత్తతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా సరైన గుర్తులతో కొత్త బ్యాలెట్ పేపర్లు అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాతే ఓటింగ్ జరగనుంది.