సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన రూట్ మార్చారు. వరుసగా వైవిధ్యమైన కథలను లైన్లో పెడుతున్న విజయ్, తాజాగా తన 15వ సినిమా (VD15) అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తన మొదటి సినిమా ‘హాయ్ నాన్న’తో మేకింగ్ స్టైల్‌లో కొత్త ఒరవడి సృష్టించిన డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. విజయ్, తన గ్యాంగ్ చేతిలో ఆయుధాలు పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న విజువల్ చూస్తుంటే, ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. ముఖ్యంగా పోస్టర్ పై ఉన్న ‘ఇప్పటి కోపం అంతా ఒకప్పటి ప్రేమ’ అనే లైన్ సినిమా థీమ్ మీద భారీ అంచనాలు పెంచేసింది. ప్రేమ నుంచి పుట్టిన పగ నేపథ్యంలో ఈ కథ సాగబోతున్నట్లు తెలుస్తోంది.
విజయ్ – శౌర్యువ్ కాంబోలో వస్తున్న ఈ భారీ చిత్రాన్ని ‘హాయ్ నాన్న’ నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ సెన్సేషన్ హేశం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ‘ఖుషి’ తర్వాత విజయ్, హేశం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటంతో మెలోడీ సాంగ్స్ మీద కూడా ఫ్యాన్స్‌కు ధీమా పెరిగింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన’, గౌతమ్ తిన్ననూరితో ‘రణబాలి’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్‌లోనే శౌర్యువ్ సినిమాను కూడా అనౌన్స్ చేసి తన లైనప్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది.
