ఉపాధ్యక్ష పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం కొత్త రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ధన్కర్ రాజీనామాపై ఊహాగానాలు మొదలయ్యాయి. తీవ్ర రాజకీయ వాగ్వాదం కూడా జరుగుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:05 గంటల మధ్య ఆనారోగ్య కారణాలను చూపుతూ ధన్కర్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో ఏం జరిగింది? అని తెలుసుకోవాలనే ఉత్కంఠ దేశ ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. సాయంత్రం 4- రాత్రి 9:05 గంటల(305 నిమిషాలు) మధ్య ఏం జరిగింది? అనేది పూర్తిగా తెలియరాలేదు.
READ MORE: Mahabubabad: తల్లి కర్కషత్వం.. కొడుకు పై వేడి నీళ్ళు పోసి దారుణం.. కారణం అదే!
- వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.
- ఉదయం 11:16 గంటలకు, జగదీప్ ధన్కర్ ప్రతిపక్ష నాయకుడు ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
- ఉదయం 11:45 గంటలకు పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్ అంశంపై గందరగోళం చెలరేగింది. దీంతో ధన్కర్ రాజ్యసభ కార్యకలాపాలను వాయిదా వేశారు.
- బిజినెస్ అడ్వైజరీ కమిటీ మధ్యాహ్నం 12:30 గంటలకు సమావేశమైంది.
- 2 గంటల తర్వాత, జగదీప్ ధన్కర్ జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మాన నోటీసును అంగీకరించారు.
- సాయంత్రం 4:07 గంటలకు, ఆయన సభలో అభిశంసన ప్రక్రియ గురించి సమాచారం ఇచ్చారు. సాయంత్రం 4:19 గంటలకు సభ నుంచి వాకౌట్ చేశారు.
- సాయంత్రం 4.30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మళ్ళీ సమావేశమైంది. ఆ తర్వాత ధన్కర్ సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ప్రతిపక్ష నాయకులతో సమావేశమయ్యారు.
- రాత్రి 9:05 గంటలకు ధన్కర్ తన రాజీనామాను రాష్ట్రపతికి పంపారు.
- రాజీనామాను మరుసటి రోజు మధ్యాహ్నం 12:07 గంటలకు రాష్ట్రపతి ఆమోదించారు.
- మధ్యాహ్నం 12:19 గంటలకు, ప్రధాని మోడీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ధన్కర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.
ఇలాంటి పరిస్థితిలో, ధంఖర్ నిజంగా ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారా లేదా ఆయన రాజీనామాను తీసుకున్నారా అనేది ప్రశ్న. నిన్న రోజంతా రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత ధన్కర్ కు అకస్మాత్తుగా ఏమైంది అనేది మరో ప్రశ్న. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గత రెండేళ్ల పదవీకాలంలో ధన్కర్‌ను ప్రతిపక్షాలు తిట్టిపోశాయి. నేడు ప్రతిపక్షాలు అకస్మాత్తుగా ఆయనపై ప్రేమను కురిపిస్తున్నాయి.
