NTV Telugu Site icon

Jamuna: అలనాటి నటి జమునకు ప్రముఖుల నివాళులు

Actor Jamuna

Actor Jamuna

Jamuna Passes Away: అలనాటి అందాల నటి జమున తిరిగిరాని లోకాలకు వెళ్లింది. నటి జమునకు రాజకీయ, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. దిగ్గజ నటులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, జగ్గయ్య, ఎస్వీ రంగరావు సహా పలువురు నటులతో జమున నటించారు.

తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు: చిరంజీవి
సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను. -మెగాస్టార్ చిరంజీవి

తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు: పవన్‌కళ్యాణ్‌
ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు జమున దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన జమున తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. జమున గారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. -పవన్‌ కళ్యాణ్‌

నటనకే ఆభరణంగా మారారు: నందమూరి బాలకృష్ణ
అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున . చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున. నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు.. ఈ రోజున జమున గారు బౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి… వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను -నందమూరి బాలకృష్ణ

వారిని గుర్తుంచుకుంటాం: మహేశ్‌ బాబు
జమున మరణవార్త ఎంతో బాధాకరం. ఆమె చేసిన అన్ని ఐకానిక్ పాత్రలు, పరిశ్రమకు ఆమె చేసిన అపారమైన సహకారాన్ని అందరూ గుర్తుంచుకుంటారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. -సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు

జమున మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం
అలనాటి సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత జమున మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ వివిధ పాత్రల్లో నటించి, అభిమానులను చూరగొన్న గొప్ప నటి జమున అని ప్రశంసించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేశారు.

చిత్రపరిశ్రమకు తీరని లోటు:రేవంత్ రెడ్డి
సినీనటి జమున మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. జమున మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. వివిధ భాషలలో వందలాది సినిమాలలో నటించడమే కాకుండా అగ్ర తరాల పక్కన నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన కొనియాడారు. జమున ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు.

Show comments