రాజన్న సిరిసిల్ల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ప్రాణాలతో పోరాడుతున్న ఓ వ్యక్తికి కిరాయి ఇంట్లో ఆశ్రయం దొరకకపోవడంతో.. చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు అతడిని వేములవాడలోని వైకుంఠధామానికి తీసుకెళ్లారు. అక్కడే అతడికి ఆశ్రయం కల్పించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అంతేకాదు మనుషుల మానవత్వంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.
మర్రిపల్లి రాకేష్ కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. జాండీస్‌తో పాటు శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. రాకేష్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రస్తుతం రాకేష్ ఆరోగ్యం మరింత క్షీణించగా.. ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబం ఉంటున్న కిరాయి ఇంట్లోకి రాకేష్‌ను తీసుకురావడానికి ఇంటి యజమాని అనుమతించలేదు. ఇప్పటికే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమకు ఎక్కడా ఆశ్రయం లభించకపోవడంతో.. దిక్కుతోచని స్థితిలో వేములవాడ వైకుంఠధామానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడే రాకేష్‌కు ఆశ్రయం కల్పించి అతడి బాగోగులు చూసుకుంటున్నారు.
బతికుండగానే తమ కుటుంబం స్మశానవాటికకు చేరాల్సిన పరిస్థితి వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి కనీసం ఆశ్రయం కూడా దొరకకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తమకు ఎదురైన పరిస్థితిని వివరిస్తూ మానవత్వం మంటగలిసిందని వాపోతున్నారు. తమ దుస్థితిని గుర్తించి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. ప్రాణాలతో పోరాడుతున్న రాకేష్‌కు తక్షణమే మెరుగైన వైద్యం అందించడంతో పాటు కుటుంబానికి నివాసం మరియు ఆర్థిక సహాయం కల్పించాలని కోరుతోంది.

