Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..

Veeramachineni Ramakrishna

Veeramachineni Ramakrishna

Veeramachineni Ramakrishna: ‘వీఆర్‌కే డైట్‌’, ‘వీరమాచినేని డైట్‌’ పేరిట తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన, రాయదుర్గంలోని వీఆర్‌కే హెల్త్‌ కేర్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడు వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్‌ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కొవ్వు, ప్రొటీన్‌ ఆధారిత ఆహారంతో ఎలాంటి అనారోగ్యాన్ని అయినా నయం చేస్తానంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆయన సవాల్‌ చేస్తుండటంతో, నిర్మల్‌ జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఓ న్యాయవిద్యార్థి ఆ ప్రకటనలు, వీడియోలు చూసి ఆయనను సంప్రదించారు. మధుమేహం (టైప్‌-1 డయాబెటిస్)తో బాధపడుతూ ఇన్సులిన్‌ తీసుకుంటున్న ఆ బాధితుడికి, వీరమాచినేని రామకృష్ణతో పాటు కోటేశ్వరరావు కలిసి టైప్‌-1 డయాబెటిస్‌ నయం చేస్తామని చెప్పి కొన్ని ఆరోగ్య చిట్కాలు సూచించారు.

ఇన్సులిన్‌తో పాటు ఇతర మందులు వాడొద్దని, తమ చిట్కాలు మాత్రమే పాటించాలని తెలపడంతో పాటు అందుకుగాను రూ.26 వేలు ఫీజుగా తీసుకున్నారు. ఈ క్రమంలో వీఆర్‌కే చెప్పిన డైట్‌ను ఈనెల 12న ఆ న్యాయ విద్యార్థి ప్రారంభించగా, సూచనల మేరకు నడుచుకున్న కేవలం రెండు రోజుల్లోనే (ఈనెల 14న) తీవ్ర డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు పాలుకావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం కోసం రూ.58 వేలకుపైగా బిల్లు అయింది. వీరమాచినేని రామకృష్ణ చెప్పిన ఆరోగ్య చిట్కాల వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ బాధితుడు ఈనెల 24న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరోవైపు, సామాజిక మాధ్యమాల వేదికగా ‘వీఆర్‌కే డైట్‌’ పేరిట అనధికార వైద్య సలహాలు ఇస్తూ, అల్లోపతి వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌‌ అసోసియేషన్‌ ఇటీవల దాఖలు చేసిన కేసు విచారణ కూడా వాయిదా పడింది. ఈ కేసు విచారణను సిటీ సివిల్‌ కోర్టు నవంబరు 25కి వాయిదా వేస్తూ, వీరమాచినేనికి సమన్లు జారీ చేసింది.