Site icon NTV Telugu

Veera Raghava Reddy : మొయినాబాద్‌లో వీర రాఘవరెడ్డిపై దాడి.. వాతలు వచ్చేలా…!

Veera Raghava Reddy

Veera Raghava Reddy

Veera Raghava Reddy : గతంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసి సంచలనం సృష్టించిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి తాజాగా మరోసారి దాడికి గురయ్యాడు. గురువారం (మే 1, 2025) కండిషన్ బెయిల్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసి తిరిగి వస్తున్న వీర రాఘవరెడ్డి ఓ టీ స్టాల్ వద్ద ఆగగా, అక్కడికి చేరుకున్న దుండగులు ఒక్కసారిగా అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో వీర రాఘవరెడ్డికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో దాడి చేసిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వీర రాఘవరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

PM Modi Amaravati Tour: అమరావతి రీలాంచ్‌.. నేడే ఏపీకి ప్రధాని మోడీ

అయితే.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి ‘రామరాజ్యం’ పేరుతో ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నాడు. దేశంలో రామరాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో అతడు ప్రచారం చేస్తున్నాడు. అయితే.. కేవలం పదో తరగతి పాసైన, ఫెయిలైన యువకులను తన సైన్యంలోకి రిక్రూట్ చేసుకుంటున్నాడు. ఈ సైన్యంలో చేరడానికి 5 కిలోమీటర్లు నడవగలగడం, 2 కిలోమీటర్లు పరిగెత్తగలగడం, 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండటం వంటి అర్హతలు ఉన్నాయి. ఒక్కొక్కరికి నెలకు రూ. 20 వేల జీతం కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

వీర రాఘవరెడ్డి యువతను తన సైన్యంలో చేర్చుకుని వారితో దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌ను తన రామరాజ్యం సైన్యంలో చేరాలని ఒత్తిడి చేశాడు. ఆయన నిరాకరించడంతో తన ప్రైవేట్ సైన్యంతో అర్చకుడి ఇంటిపై తన సైన్యంతో దాడికి దిగాడు. అంతేకాకుండా ఆయన కుమారుడిని కూడా కొట్టించాడని ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో కూడా వీర రాఘవరెడ్డిపై దాడి కేసు నమోదైంది. తాజాగా తనపై జరిగిన దాడిపై వీర రాఘవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో అతడిపై ఉన్న ఆరోపణలు, తాజాగా జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది.

CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

Exit mobile version