VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!

Satheesan

Satheesan

VD Satheesan: కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న కాంగ్రెస్ నేత ‘వీడీ సతీశన్’ భావోద్వేగానికి గురైన ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన రాజకీయ గురువుగా భావించే దివంగత కాంగ్రెస్ దిగ్గజ నేత కార్తికేయన్ కుటుంబ సభ్యులను తిరువనంతపురంలో శుక్రవారం కలిసిన సతీసన్, ఆయన భార్యను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా కార్తికేయన్ భార్య కూడా భావోద్వేగానికి లోనయ్యారు. వీడీ సతీశన్ ను ఓదారుస్తూ “ఒక సీఎం ఇలా ఏడవకూడదు” అని చెప్పిన మాటలు అక్కడ ఉన్నవారిని కదిలించాయి. గురువు కుటుంబంపై సతీశన్ కు ఎంత ఆప్యాయత, గౌరవం ఉందో ఈ ఘటన ద్వారా స్పష్టమైంది. ఇదిలా ఉండగా, సతీసన్ సీనియర్ కాంగ్రెస్ నేత రమేశ్ ను కూడా కలిశారు. సీఎం అభ్యర్థిత్వం తనకు దక్కకపోవడంపై చాలా అసంతృప్తిగా ఉన్నారనే వార్తల మధ్య ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సతీశన్, “రమేశ్ మా నాయకుడు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే ఆయన నాకు మార్గదర్శకుడు. ఇప్పుడు కూడా ఆయనే నా నాయకుడు. ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికే వచ్చాను. ఆయన మద్దతు ఎప్పుడూ నాతో ఉంటుంది” అని అన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కూడా సతీశన్ ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ భేదాలు అడ్డుకావొద్దని వ్యాఖ్యానించారు.

పినరయి విజయన్ కేరళ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు. ప్రతి అంశంలో మేము ఏకీభవించకపోయినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలి. గత ప్రభుత్వాలు ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులను కొనసాగిస్తాం. ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను మరో ప్రభుత్వం రద్దు చేస్తే రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుంది? అని సతీసన్ పేర్కొన్నారు. కాగా, వీడీ సతీసన్ సోమవారం ఉదయం 10 గంటలకు తిరువనంతపురంలోని లోక్ భవన్‌ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) 140 స్థానాల్లో 102 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. దీంతో దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి ముగింపు పలికింది.