NTV Telugu Site icon

Odisha: అయ్యో పాపం.. పెన్షన్ కోసం వెళితే పిల్లలు పుట్టకుండా చేశారే!

Odisha

Odisha

జనాభా పెరగకుండా ఉండటం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. ఈ విషయంలో తమ టార్గెట్ ను పూర్తి చేయడం కోసం ఓ ఆశావర్కర్ దారుణానికి పాల్పడింది. పెన్షన్ ఇప్పిస్తానని ఒక మూగ యువకుడిని తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. అతని తల్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

వివరాల ప్రకారం గాంగదురువ అనే 26 యేళ్ల యువకుడు ఒడిశాలోని మత్తిలి సమితి మొహిపోధర్‌ పంచాయతీ అంబగూడలో ఉంటున్నాడు. అతను పుట్టుకతోనే మూగ. ఈ నెల 3వ తేదీన గ్రామానికి చెందిన ఆశా వర్కర్‌ అతని ఇంటికి వచ్చింది. పెన్షన్‌ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి అతడిని మత్తిలి సమితి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. అనంతరం అతడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. ఇంటికి వచ్చి మందులు వేసుకుంటున్న కుమారుడిని చూసి తల్లి అతడిని ఎందుకు మందులు వేసుకుంటున్నావని నిలదీసింది. దాంతో జరిగిన విషయాన్ని తల్లికి వివరించాడు గాంగదురువ.

Also Read: Balmoori Venkat : కేటీఆర్ షాడో సీఎం.. గ్రూప్ 2 వాయిదా వేయండి అని ట్వీట్ చేశాడు

దీంతో తల్లి తమ బంధువులతో వెళ్లి ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి ఆశావర్కర్ తప్పు చేసిందని నిరూపితమైతే చర్యలు తీసుకుంటామని మల్కన్‌గిరి జిల్లా వైద్యాధికారి ప్రపుల్ల కుమార్‌ తెలిపారు. విచారణ నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రి నుంచి బృందాన్ని మత్తిలి పంపించామన్నారు. దీనిలో మరో విచారకరమైన విషయం ఏంటంటే ఆ యువకుడికి ఇప్పటి వరకు ఇంకా పెళ్లికాలేదు. పెళ్లికాకుండా తన కొడుకును ఇలా చేశారంటూ అతని తల్లి రోదిస్తోంది.