NTV Telugu Site icon

Varisu Trailer : ‘వారిసు’ ట్రైలర్ హంగామా!

Varisu Trailer

Varisu Trailer

హీరో తమిళుడు. నిర్మాత, దర్శకులు తెలుగువారు. అటు తమిళులు, ఇటు తెలుగువారు. మధ్యలో కొందరు కన్నడిగులు అందరూ కలసి వండివార్చిన అసలు సిసలు దక్షిణాది వంటకం ‘వారిసు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’గా రానుంది. విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో జనవరి 12న దూకబోతోంది. ఈ నేపథ్యంలో ‘వారిసు’ ట్రైలర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. అలా వచ్చిందో లేదో ఇలా విజయ్ ఫ్యాన్స్ ‘వారిసు’ ట్రైలర్ ను తెగ చూసేస్తున్నారు. ఇందులో జయసుధ, శ్రీకాంత్ వంటి తెలుగువారు, వారితో పాటు రశ్మిక, సుమన్, ప్రకాశ్ రాజ్ వంటి తెలుగువారికి సుపరిచితులైన కన్నడిగులు నటించారు. తమిళనాట ‘దళపతి’గా సూపర్ స్టార్ డమ్ చూస్తోన్న విజయ్ తో పాటు ఇందులో తెలుగువారికి బాగా తెలిసిన ప్రభు, శరత్ కుమార్, ఖుష్బూ, సంగీత, ఎస్.జె.సూర్య కూడా అభినయించారు.

‘వారిసు’ ట్రైలర్ చూస్తోంటే- అందులో ప్రత్యర్థుల సవాళ్ళు కనిపిస్తున్నాయి. కనికట్టు చేసే నాయిక అందాలు ఉడికిస్తున్నాయి. హీరో విజయ్, యోగిబాబుతో కలసి చేసిన కామెడీ కూడా కడుపు చెక్కలు చేసేలా అనిపిస్తోంది. ఇక విజయ్ తన మార్కు యాక్షన్ సీన్స్ లోనూ భలేగా సాగారు. అన్నీ కలసి ఓ కుటుంబం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందిందని టైటిల్ చూస్తేనే తెలుస్తోంది. మరి ఈ సినిమా తెలుగు వర్షన్ ‘వారసుడు’ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో కానీ, ఇప్పుడు మాత్రం ‘వారిసు’ ట్రైలర్ ను విజయ్ ఫ్యాన్స్ చూసి మురిసిపోతున్నారు. మరి పొంగల్ బరిలో ‘వారిసు’ హంగామా ఏ తీరున ఉంటుందో చూడాలి.

Show comments