NTV Telugu Site icon

Gyanvapi Mosque: నేటి నుంచి జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే

Gyanvapi

Gyanvapi

Gyanvapi Mosque: వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే సోమవారం ఉదయం ప్రారంభమవుతుందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఆదివారం నాడు ఏఎస్‌ఐ బృందం కావాల్సిన అన్ని పరికరాలతో వారణాసికి చేరుకుంది. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయమే ఏఎస్‌ఐ అధికారులు మసీదు వద్దకు చేరుకోగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శివలింగం ఉన్నట్టుగా హిందూ ప్రతినిధులు చెబుతున్న ‘వాజుఖానా’ మినహా మసీదులో అంతటా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల ద్వారా సర్వే చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. మసీదు హిందూ దేవాలయంపై నిర్మించబడిందని పేర్కొంటూ కొంతమంది మహిళల పిటిషన్‌పై ప్రతిస్పందనగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మసీదు లోపల పురాతన హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఉన్నాయని, శాస్త్రీయ సర్వే మాత్రమే నిజాన్ని వెల్లడిస్తుందని మహిళలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆగస్టు 4లోపు జిల్లా కోర్టుకు నివేదికను సమర్పించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Also Read: Facebook Love: ఫేస్‌బుక్ ప్రేమకథ.. ప్రియుడి కోసం సరిహద్దు దాటి పాక్ వెళ్లిన భారతీయ మహిళ

జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహణకు అనుమతించాలంటూ హిందువుల తరఫున విష్ణు శంకర్‌ జైన్‌ అనే న్యాయవాది పిటిషన్‌ వేశారు. దీనిపై వారణాసి జిల్లా కోర్టు జులై 14న వాదనలు విన్నది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించి సర్వేకు అనుమతిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. అయితే శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ నేడు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ముందుకు రానుంది.