Varanasi Movie: భారతీయ చిత్ర పరిశ్రమలో ఓవర్సీస్ మార్కెట్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ రాబోయే చిత్రం ‘కింగ్’తో విడుదలకు ముందే సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పారు. అయితే, ఇప్పుడు ఆ రికార్డును సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’తో అధిగమించబోతున్నారా.? అనే ఆసక్తికర చర్చ మూవీ ట్రేడ్ వర్గాల్లో మొదలైంది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటిస్తున్న భారీ చిత్రం ‘కింగ్’. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.175 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. భారతీయ సినీ చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ రికార్డ్ డీల్. విడుదలకు ముందే ఇంతటి భారీ ధరకు హక్కులు అమ్ముడుపోవడంతో, రాబోయే రోజుల్లో ఈ మైలురాయిని అధిగమించగల హీరో ఎవరు అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. షారుక్ ఖాన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సౌత్ నుంచి ఓవర్సీస్ మార్కెట్‌ను శాసించే సత్తా ఉన్న హీరోలలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. కేవలం ప్రాంతీయ (రీజనల్) చిత్రాలతోనే అమెరికా సహా విదేశీ గడ్డపై అత్యధిక మిలియన్ డాలర్ల మార్కులను అందుకున్న ఏకైక సౌత్ హీరోగా ఆయన చరిత్ర సృష్టించారు. మహేష్ క్రేజ్, ఓవర్సీస్ మార్కెట్ స్టామినా దృష్ట్యా షారుక్ రికార్డును బ్రేక్ చేయడం ఆయనకే సాధ్యమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’. దాదాపు రూ.1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ స్థాయి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. కేవలం ఈ సినిమా ఇండియన్ లాంగ్వేజెస్ ఓవర్సీస్ రైట్స్ కోసమే ఇప్పటికే రూ.160 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ ఘనవిజయంతో రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్, దానికి తోడు మహేష్ బాబుకు ఉన్న ఓవర్సీస్ బాక్సాఫీస్ పుల్ తోడైతే మార్కెట్ లెక్కలు పూర్తిగా తారుమారు కావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న దాదాపు 120కి పైగా దేశాల్లో ఐమాక్స్ (IMAX) ఫార్మాట్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం, రిలీజ్ సమయానికి రూ.200 కోట్ల ఓవర్సీస్ మార్కును సునాయాసంగా దాటేసి ‘కింగ్’ రికార్డును బద్దలు కొడుతుందని ఇండస్ట్రీ నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

