Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కీలక బిల్లు తీసుకురానుంది. దీనికి సంబంధించిన జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం((FCRA) సవరణ బిల్లు-2026, జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు-2026తో పాటు మరణాల నమోదు(సవరణ)బిల్లు-2026ను సభలో ప్రవేశపెట్టనున్నారు. జూలై 20 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుల్ని ఆమోదింపచేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
వందేమాతరాన్ని అవమానిస్తే జైలే:
జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026 బిల్లు ద్వారా జాతీయ గీతం ‘‘వందేమాతరం’’ ఆలాపనను అవమానించడం లేదా అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఇందు కోసం 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టూ నేషనల్ హానర్ యాక్ట్‌లో సవరణ చేయనుంది.
FCRA సవరణ బిల్లు:
వివాదాస్పదమైన విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026ను కూడా పరిశీలన, ఆమోదం కోసం ప్రభుత్వం జాబితాలో చేర్చిందని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టారు. కానీ పరిశీలన, ఆమోదం కోసం ముందుకు రాలేదు. ఆ సమయంలో కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఉండటం, దీనిపై ఆ రాష్ట్రంలోని కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో బిల్లు నిలిచిపోయింది. దీనిని ఇప్పుడు ఆమోదం కోసం ముందుకు తీసుకురాబోతుున్నారు.
జనన, మరణాల నమోదు నిబంధనలు కఠినతరం:
జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026 ద్వారా 1969 చట్టంలోని సెక్షన్ 13(3)లో మార్పులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఆలస్యంగా జననాలు, మరణాల నమోదుకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

