Vande Bharat Brakes Fail: భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగించే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రేకింగ్ సిస్టమ్ పనిచేయని ఖాళీ వందే భారత్ రైలు ఏకంగా 463 కిలోమీటర్లు ప్రయాణించింది. ఝార్ఖండ్‌లోని హటియా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి వెళ్తున్న ఈ రైలును మార్గమధ్యంలో లోకో పైలట్లు పలుమార్లు హెచ్చరించినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఈ ఘటనపై దక్షిణ తూర్పు రైల్వే (SER) స్పందించి విచారణకు ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 24న ఖాళీ వందే భారత్ చైర్ కార్ రేక్‌ను మాల్గూడ్స్ రైలు ఇంజిన్ సాయంతో హటియా నుంచి ఝాన్సీకి తరలించాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం వందే భారత్ కోచ్‌ల బ్రేకింగ్ సిస్టమ్‌ను మాల్గూడ్స్ ఇంజిన్ బ్రేకింగ్ సిస్టమ్‌తో అనుసంధానం చేయాలి. అయితే సంబంధిత రైల్వే సిబ్బంది ఈ ప్రక్రియను సరిగ్గా నిర్వహించలేదు. దీంతో రైలు కోచ్‌లలో బ్రేకులు పనిచేయని పరిస్థితి ఏర్పడింది.
హటియా నుంచి బయలుదేరిన తర్వాత రాంచీ స్టేషన్ సమీపంలో లోకో పైలట్ బ్రేక్ ఫీల్, బ్రేక్ పవర్ పరీక్షలు నిర్వహించగా బ్రేకింగ్ సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సెక్షన్ కంట్రోలర్, ట్రాక్షన్ లోకో కంట్రోలర్‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రైలును ఆపకుండా ముందుకు వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత మురి స్టేషన్లో మరో లోకో పైలట్ బాధ్యతలు స్వీకరించగా, ఆయనకు కూడా ఇదే సమస్య ఎదురైంది. బ్రేకులు సరిగా పనిచేయడం లేదని అధికారులను హెచ్చరించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో ఉన్న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ (DDU) జంక్షన్‌కు చేరుకున్న తర్వాత రైలును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వందే భారత్ రేక్‌లోని అన్ని కోచ్‌ల బ్రేకింగ్ సిస్టమ్‌లు పనిచేయడం లేదని తేలింది. దీంతో 463 కిలోమీటర్ల ప్రయాణంలో రైలు ఇంజిన్ బ్రేకులు, రీజెనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థపైనే ఆధారపడినట్లు వెల్లడైంది.
ఈ ఘటనలో కోచ్ అండ్ వ్యాగన్ (C&W) నిర్వహణ సిబ్బంది, సంబంధిత స్టేషన్ల సెక్షన్ కంట్రోలర్లు, ట్రాక్షన్ కంట్రోలర్లు, రైలు నడిపిన సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. రైలును పంపించే ముందు కోచ్‌ల బ్రేకింగ్ వ్యవస్థను భౌతికంగా ఎందుకు తనిఖీ చేయలేదని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వందే భారత్‌లోని ఆధునిక బ్రేకింగ్ వ్యవస్థపై లోకో పైలట్లకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్ర భద్రతా వైఫల్యంగా పరిగణించిన దక్షిణ తూర్పు రైల్వే జోన్.. రాంచీ డివిజన్ డీఆర్ఎంకు సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. బాధ్యులైన సిబ్బందిని గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

