Valentines Day: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రేమను వ్యక్తపరచుకునే ఈ ప్రత్యేక రోజును జంటలు తమ జీవితంలో గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమయ్యే వాలెంటైన్స్ వీక్, ప్రేమికుల దినోత్సవం నాటికి ముగుస్తుంది. ఈ సందర్భాన్ని మనం స్వేచ్ఛగా ఆనందంగా జరుపుకున్నప్పటికీ, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ రోజు జరుపుకోవడం పూర్తిగా నిషేధించబడింది. ఆ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం పాశ్చాత్య సంస్కృతికి చెందినదిగా భావించడంతోపాటు, స్థానిక సంప్రదాయాలకు విరుద్ధమని నమ్ముతారు. ప్రేమికుల దినోత్సవాన్ని ఉల్లంఘిస్తే, అక్కడ కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. మరి ప్రేమికుల దినోత్సవాన్ని నిషేధించిన దేశాలు ఏంటి వాటి వివరాలను చూద్దామా..
Also Read: Rajat Patidar RCB: మూడేళ్ల ముందు అమ్ముడే పోలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్!
సౌదీ అరేబియా:
సౌదీ అరేబియా ఒక సంప్రదాయ ఇస్లామిక్ దేశం. ఇక్కడ షరియా చట్టం అమలులో ఉంటుంది. ప్రేమికుల దినోత్సవాన్ని సౌదీ ప్రభుత్వం పాశ్చాత్య సంస్కృతి భావించి, అది ఇస్లామిక్ సంప్రదాయాలకు అనుకూలంగా లేదని పేర్కొంటుంది. ఈ కారణంగా ఫిబ్రవరి 14న పూలు, ప్రేమలేఖలు లేదా చాక్లెట్లను ఇచ్చిపుచ్చుకోవడం నిషేధం.
ఇరాన్:
ఇరాన్‌లో కూడా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం నిషేధంగా ఉంది. ఇక్కడ ఈ దినోత్సవాన్ని పాశ్చాత్య ప్రభావంగా భావిస్తారు. ఇరాన్ అధికారులు చాలా సందర్భాల్లో ప్రేమికుల దినోత్సవానికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకుని, మీడియాపై నియంత్రణ కూడా విధించారు.
Also Read: VishwakSen : నేనేం భయపడను.. నాకు సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు : విశ్వక్ సేన్
పాకిస్తాన్:
పాకిస్తాన్‌లో 2018లో ఇస్లామాబాద్ హైకోర్టు ప్రేమికుల దినోత్సవాన్ని బహిరంగంగా జరపరాదని ఉత్తర్వు జారీ చేసింది. వాలెంటైన్స్ డే పాశ్చాత్య సంస్కృతి భాగమని, ఇది ఇస్లామిక్ సంప్రదాయాలకు వ్యతిరేకమని కోర్టు స్పష్టం చేసింది.
ఉజ్బెకిస్తాన్:
ఉజ్బెకిస్తాన్‌లో 2012 తర్వాత ప్రేమికుల దినోత్సవం నిషేధానికి గురైంది. ఈ రోజు ఉజ్బెకిస్తాన్ జాతీయ వీరుడు, మొఘల్ చక్రవర్తి బాబర్ పుట్టినరోజు కావడంతో వాలెంటైన్స్ డేను కాకుండా బాబర్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు.
ప్రేమకు అవరోధాలు ఏ మాత్రం ఉండకూడదు అని చాలామంది నమ్ముతున్నా, కొన్ని దేశాలు తమ సాంప్రదాయాలను కాపాడుకోవడమే ముఖ్యమని భావిస్తాయి. అయితే ప్రపంచం మారుతుందనీ, ప్రేమను వ్యక్తపరచడం స్వేచ్ఛగా జరగాలనే అభిప్రాయాలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి.