Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..

Vaibhav Soorya

Vaibhav Soorya

ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మనందరికీ తెలుసు. అతను కేవలం లైమ్‌లైట్‌లోకి రావడమే కాకుండా, ఏకంగా భారత జాతీయ జట్టులో కూడా చోటు సంపాదించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం వైభవ్‌ను సెలెక్టర్లు భారత జట్టుకు ఎంపిక చేశారు. ప్రస్తుతం అతను ఇండియా-ఎ జట్టు తరఫున ట్రై నేషన్ ఏ సిరీస్‌లో ఆడుతున్నాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచినప్పటికీ, భవిష్యత్తులో అతను పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడతాడని క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి స్నేహితుడు అయాన్ రాజ్ కూడా ఇప్పుడు బ్యాట్‌తో మైదానంలో ఊచకోత కోస్తూ వార్తల్లో నిలిచాడు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 14 ఏళ్ల అయాన్ రాజ్, జిల్లా అండర్-16 క్రికెట్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో ఒక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు స్థానిక క్రికెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బీహార్ క్రికెట్‌కు మరో అద్భుతమైన ముత్యం దొరికిందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అయాన్ కేవలం 83 బంతుల్లోనే 210 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.

×
×
Ad

ముజఫర్‌పూర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జిల్లా అండర్-16 క్రికెట్ లీగ్‌లో అయాన్ రాజ్ ‘సంస్కృతి క్లబ్’ తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు అయాన్ చుక్కలు చూపించాడు. మైదానం చుట్టూ బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 83 బంతుల్లోనే 35 ఫోర్లు, 9 అద్భుతమైన సిక్సర్ల సహాయంతో 210 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతని ఈ వీరోచిత డబుల్ సెంచరీ కారణంగా సంస్కృతి క్లబ్ జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 464 పరుగుల భారీ స్కోరును సాధించగలిగింది. ఈ భారీ స్కోరు వెనుక అయాన్ రాజ్ ఆడిన రికార్డు ఇన్నింగ్స్ అత్యంత కీలకమైనది, అందుకే ఇప్పుడు అందరూ అతనిని అభినందిస్తున్నారు.

అయితే అయాన్ రాజ్ ఇలా వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అతను జిల్లా క్రికెట్‌లో తన బ్యాటింగ్ పవర్ ఏంటో నిరూపించుకున్నాడు. గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక మ్యాచ్‌లో అతను ఏకంగా అజేయంగా 327 పరుగులతో ట్రిపుల్ సెంచరీ సాధించి క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు మళ్లీ వరుసగా అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుండటంతో, బీహార్ క్రికెట్‌లో ఎదుగుతున్న గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా అయాన్ రాజ్ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కొంతమంది క్రికెట్ నిపుణులు సైతం అయాన్ రాజ్ గనుక ఇదే రకమైన ఫామ్‌ను, ప్రదర్శనను మున్ముందు కూడా కొనసాగిస్తే, కచ్చితంగా భవిష్యత్తులో బీహార్ రాష్ట్రంతో పాటు భారతదేశం పేరును కూడా ప్రపంచ స్థాయిలో నిలబెడతాడని బలంగా నమ్ముతున్నారు. చిన్న వయసులోనే స్నేహితులు ఇద్దరూ క్రికెట్ ప్రపంచంలో ఇలా అద్భుతాలు సృష్టిస్తుండటం విశేషం.