Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..

Soorya

Soorya

యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ భారత్‌ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, ప్లేయింగ్‌ ఎలెవన్‌లో స్థానం కోసం గట్టిగా శ్రమిస్తున్నాడు. త్వరలో భారత్‌లో వెస్టిండీస్‌తో సిరీస్‌ ముగిసిన తర్వాత కివీస్‌ పర్యటన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ హెడ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

కేవలం 15 ఏళ్ల వయస్సు గల వైభవ్‌ సూర్యవంశీ, న్యూజిలాండ్‌లోని అత్యంత వేగవంతమైన, బౌన్సీ పిచ్‌లపై ఏ విధంగా రాణిస్తాడనే దానిపై ఆసక్తిగా ఉన్నట్లు కోచ్‌ తెలిపారు. ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడిని విభిన్న పరిస్థితుల్లో ఒత్తిడిలో చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అండర్‌-19 క్రికెట్‌ మొదలుకొని దేశీయ క్రికెట్‌, ఐపీఎల్‌ వరకు తన సత్తా చాటిన వైభవ్‌, అంతర్జాతీయ వేదికపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంగ్లండ్‌లో అనుకున్న స్థాయిలో రాణించకపోయినా, జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచి అదరగొట్టాడు.

గతంలో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ చేతిలో ఓటమిపాలైన విషయాన్ని గుర్తుచేస్తూ, కివీస్‌ జట్టు సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శన కనబరచాలని భావిస్తోందని కోచ్‌ పేర్కొన్నారు. ఒకవేళ వైభవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కితే, అతడిపై కివీస్‌ బౌలర్లు ప్రత్యేక వ్యూహాలతో దెబ్బకొట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు. కచ్చితంగా బౌన్సర్లతో దాడిచేస్తామని పేర్కొన్నాడు. ఈ పర్యటన వైభవ్‌ కెరీర్‌కు అత్యంత కీలకమైన మలుపు కానుంది. విదేశీ గడ్డపై, అది కూడా సవాలుతో కూడిన పిచ్‌లపై తన ప్రతిభను మరోసారి నిరూపించుకునేందుకు ఈ యువ సంచలనం సిద్ధమవుతున్నాడు.