Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ సారి ఆటతో కాకుండా.. జెర్సీ నంబర్‌కు ఉన్న టేప్‌తో వైరల్ అయ్యాడు. ఈస్ట్ జోన్ తరఫున నార్త్ ఈస్ట్ జోన్‌పై బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నేతృత్వంలోని జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ కేవలం రెండు ఫోర్లతో 8 పరుగులు మాత్రమే చేసి ఆరో బంతికే మణిపూర్ బౌలర్ బిశ్వోర్జిత్ కొంథౌజమ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
ఇదిలా ఉండగా.. వైభవ్ క్రీజులోకి వచ్చిన సమయంలో అతడు ధరించిన జెర్సీ పైభాగంలో నంబర్‌ను టేప్‌తో కప్పి ఉంచడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టేప్ వేసిన తీరును పరిశీలిస్తే కేవలం 3 అనే నంబర్ మాత్రమే స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు తరఫున వైభవ్ ‘3’ నంబర్ జెర్సీతోనే మైదానంలోకి దిగుతాడు. దులీప్ ట్రోఫీ కోసం ఇచ్చిన జెర్సీపై నంబర్ ప్రింటింగ్‌లో ఏమైనా పొరపాటు జరగడం వల్లనో, లేదా తన అదృష్ట సంఖ్య ‘3’ మాత్రమే కనిపించాలనే ఉద్దేశంతోనో ఈ విధంగా టేప్ వేసి కవర్ చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఇక, మ్యాచ్ విషయానికి వస్తే, బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ క్వార్టర్ ఫైనల్ పోరులో బెంగాల్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ అద్భుత ప్రదర్శనతో ఈస్ట్ జోన్ పైచేయి సాధించింది. ప్రారంభంలో 138 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో సుదీప్ కుమార్ ఘరామి (146), షాబాజ్ అహ్మద్ (167) సెంచరీలతో చెలరేగడంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ ఈస్ట్ జోన్ కేవలం 111 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో అభిజిత్ సర్కార్ 5 వికెట్లు తీసి మెరిపించగా, షాబాజ్ అహ్మద్ 3 వికెట్లతో రాణించాడు.

