Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్‌లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో చేర్చుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌ లో క్యాచ్ అందుకున్న వైభవ్, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో క్యాచ్ పట్టిన ఫీల్డర్‌గా చరిత్రలోకి ఎక్కాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 205 పరుగుల స్కోరును నమోదు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌ కు ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డక్‌ అవుట్ గా వెనుదిరగగా, ర్యాన్ రికెల్టన్ 7 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రికెల్టన్ వికెట్ నాండ్రే బర్గర్ బౌలింగ్ లో క్యాచ్‌ను 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా అందుకున్నాడు. ఇదే అతడి తొలి ఐపీఎల్ క్యాచ్. ఈ క్యాచ్‌తో 15 సంవత్సరాలు 58 రోజుల వయసులో ఐపీఎల్‌లో క్యాచ్ పట్టిన అతి చిన్న వయసు ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్‌లో అతి చిన్న వయసులో క్యాచ్ పట్టిన ఆటగాళ్లు:
15 ఏళ్లు 58 రోజులు – వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) vs ముంబై ఇండియన్స్, 2026
17 ఏళ్లు 16 రోజులు – ముజీబ్ ఉర్ రహ్మాన్ (పంజాబ్ కింగ్స్) vs ఆర్సీబీ, 2018
17 ఏళ్లు 163 రోజులు – రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్) vs ఢిల్లీ క్యాపిటల్స్, 2019
17 ఏళ్లు 181 రోజులు – ప్రదీప్ సంగ్వాన్ (ఢిల్లీ) vs ముంబై ఇండియన్స్, 2008
17 ఏళ్లు 201 రోజులు – వాషింగ్టన్ సుందర్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్) vs ముంబై ఇండియన్స్, 2017

ఇక మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓటమిపై స్పందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తమ బౌలర్లు 10 నుంచి 15 పరుగులు అదనంగా ఇచ్చారని, పవర్‌ప్లేలో వరుస వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ను దూరం చేసిందని తెలిపాడు. మేము బౌలింగ్‌లో మరో 10-15 పరుగులు తగ్గించాల్సింది. పిచ్ రెండు ఇన్నింగ్స్‌ లలో ఒకేలా ఉంది. కానీ పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోవడం మాకు పెద్ద దెబ్బ అయిందని హార్దిక్ పేర్కొన్నాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోగా, వైభవ్ సూర్యవంశీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు.