Site icon NTV Telugu

Uzbekistan: ఈ ముస్లిం దేశంలో ఏక కాలంలో 2 వేల మసీదులలో ప్రార్థనలు.. దీని కోసమేనా!

Uzbekistan

Uzbekistan

Uzbekistan: మధ్య ఆసియాలో ముస్లింలు అధికంగా నివసించే దేశమైన ఉజ్బెకిస్థాన్ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. ఈ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, శుక్రవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 2 వేల మసీదులలో వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సైన్స్, వాతావరణం సహకరించనప్పుడు ప్రజలు అల్లాహ్ దయ కోసం ప్రార్థించాలని మత నాయకులు పిలుపునిచ్చారు. దీంతో దేశ రాజధాని తాష్కెంట్‌లో వేలాది మంది ప్రజలు ఏకకాలంలో బహిరంగ ప్రదేశాలు, మసీదులలో ప్రార్థనలు చేయడానికి గుమిగూడారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ.. “మేము ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా ప్రార్థించలేదు, కానీ దేశంలో చాలా కాలంగా వర్షం కురవడం లేదు. కాబట్టి మేము అల్లాహ్‌ దయ కోసం ప్రార్థించాం” అని అన్నారు.

READ ALSO: Putin India Visit: ‘‘చమురు, S-400, Su-57 జెట్స్ ’’.. పుతిన్ పర్యటనలో కీలక అంశాలు..

170 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరువు..
ఉజ్బెకిస్థాన్ వాతావరణ సంస్థ నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం తాష్కెంట్ 170 సంవత్సరాలలో అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంది. గత 60 ఏళ్లలో దేశ ఉష్ణోగ్రత ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు పెరిగింది. దీంతో దేశంలో కరువు పరిస్థితులు పెరిగాయి. ఈ సంవత్సరం దేశంలో ఏర్పడిన కరువు సమస్య అనేది కేవలం వాతావరణ సమస్య కాదని, వాతావరణ మార్పుల ప్రత్యక్ష ఫలితం అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా ఆసియాలోని దాదాపు 80 మిలియన్ల జనాభాకు ప్రధాన నీటి వనరు అయిన హిమానీనదాలను వేగంగా కరిగిస్తున్నాయి. ఇదే సమయంలో మధ్య ఆసియాలో ఐదు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థలు వేగంగా పెరుగుతున్నాయి, అదే సమయంలో ఈ దేశాల నీటి వనరులు కూడా వేగంతో క్షీణిస్తున్నాయి. ఇది ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలపై తీవ్రమైన నీటి ఒత్తిడిని పెంచిందని నివేదికలు చెబుతున్నాయి.

వర్షాభావం కారణంగా ఈ దేశంలో పంటలు ఎండిపోతున్నాయి, సరస్సులు కుంచించుకుపోతున్నాయి, విద్యుత్, నీటిపారుదల వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు కుంగిపోతున్నాయి. దీంతో ప్రజలు చివరి ప్రయత్నంగా దేవుడి దయ కోసం ప్రార్థనల వైపు మొగ్గు చూపుతున్నారు. వాతావరణ పరిశోధన నుంచి అంతర్జాతీయ నివేదికల వరకు, ఇది కేవలం కాలానుగుణంగా వచ్చిన వర్షం ఆలస్యం మాత్రమే కాదని, తీవ్రమైన, దీర్ఘకాలిక వాతావరణ సంక్షోభం అని స్పష్టంగా చెబుతున్నాయి. దేశం ముఖ్యమైన పర్యావరణ సంస్కరణలు అమలు చేయకపోతే, ఇలాంటి సంక్షోభాలను నిరంతరం ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.

READ ALSO: Australian PM Wedding: 62 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం.. ప్రధాని జీవితంలో సరికొత్త అధ్యాయం..

Exit mobile version