సూర్యాపేట జిల్లాలోరి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్న కొందరిని కిడ్నాప్ చేశారని పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో తన ఎన్నికలను నిర్వహించేందుకు ఓ సంస్థకు బాధ్యతలకు అప్పగించామని.. ఆ సంస్థ ప్రతినిధులు విధి నిర్వహణలో ఉండగా వారిని ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ మేరకు నిన్న ( మంగళవారం ) కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాత్రి హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదు పై పోలీసులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే, ఇప్పటికే హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కేసీఆర్ సర్కార్ పై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇప్పుడు చేసిన తప్పులకు అప్పుడు శిక్ష పడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.