Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తానే పొగిడేసుకున్నాడు. “10 నెలల్లో 8 యుద్ధాలను ఆపేశాను” అని చెప్పుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం టారిఫ్‌లేనని పేర్కొన్నారు. తాజాగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంగ్లీష్ భాషలో తనకు అత్యంత ఇష్టమైన పదం “టారిఫ్స్” అన్నారు. అలాగే.. పదవీ విరమణ చేసిన మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తనకు అస్తవ్యస్త పరిస్థితి వదిలి వెళ్లారని తీవ్రంగా విమర్శించారు. “నేను అమెరికా బలాన్ని తిరిగి నిలబెట్టాను. 10 నెలల్లో 8 యుద్ధాలను పరిష్కరించాను. ఇరాన్ అణు ముప్పును తొలగించాను. గాజాలో యుద్ధాన్ని ముగించాను. దాదాపు 3,000 ఏళ్ల తర్వాత తొలిసారిగా అక్కడ శాంతిని తీసుకొచ్చాను. బందీలను స్వదేశానికి తీసుకొచ్చాను,” అని ట్రంప్ అన్నారు. అనంతరం.. తన ప్రభుత్వ 2026 అజెండాను సైతం వివరించారు.
READ MORE: Kohli- Rohit: విదేశీ టీ20 లీగ్స్ ఆడనున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఐపీఎల్ చైర్మన్ ఏమ్మన్నారంటే..?
అమెరికాలో పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణ అంశాన్ని ట్రంప్ పెద్దగా ప్రస్తావించకుండా తప్పించుకున్నారు. కెనడా, మెక్సికో, బ్రెజిల్, భారత్ వంటి దేశాలపై తన ప్రభుత్వం విధించిన టారిఫ్‌ల వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరిందని ట్రంప్ అన్నారు. టారిఫ్‌ల వల్ల మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు సంపాదించామని గొప్పలు చెప్పుకున్నారు. కాగా.. బైడెన్, అప్పటి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హయాంలో ఉన్న అధిక ద్రవ్యోల్బణాన్ని ఆయుధంగా చేసుకుని ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా నడుస్తోందని ప్రజలను నమ్మించడంలో ట్రంప్ తడబడుతున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం విడుదలైన రాయిటర్స్/ఇప్సోస్ సర్వే ప్రకారం.. ఇప్పటివరకు ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై ట్రంప్ పనితీరును కేవలం 33 శాతం మంది అమెరికన్లు మాత్రమే సమర్థిస్తున్నారు. అయినా తన ప్రసంగంలో ట్రంప్ ఈ పరిస్థితికి ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. బదులుగా, తన ముందు ఉన్న డెమోక్రాట్ ప్రభుత్వాన్నే తప్పుబట్టారు.
