Five Service members killed in America Helicopter Crash: అమెరికా ఆర్మీ హెలికాప్టర్ మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని యుఎస్ మిలిటరీ ఆదివారం ధ్రువీకరించింది. శనివారం ఉదయం సముద్రంలో హెలికాప్టర్ కూలిపోయిందని యూఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయ వివాదంగా మారకుండా నిరోధించే ప్రయత్నాలలో భాగంగా మధ్యధార సముద్రంలో మోహరించిన యునైటెడ్ స్టేట్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లోని ఓ హెలికాప్టర్ ఈ ప్రమాదానికి గురైంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండా ఉండేందుకు.. మధ్యధార ప్రాంతంలో ఒక ఆర్మీ బృందాన్ని అమెరికా మోహరించింది. సైనిక శిక్షణలో భాగంగా నవంబర్ 10న ఓ హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. ఐదుగురు సర్వీస్ సభ్యులను తీసుకువెళుతున్న ఆ హెలికాప్టర్ సాంకేతిక సమస్య తలెత్తడంతో మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు సైనికులు మృతి చెందారు.
ఐదుగురు సైనికుల మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. అమెరికా ప్రజలు సురక్షితంగా ఉండటం కోసం సైనికులు ఎలాంటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారన్నారు. సైనికులు తమ దేశం కోసం వారి జీవితాలను పణంగా పెడుతున్నారని వారి సేవలను బైడెన్ కొనియాడారు.
Also Read: Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఘర్షణలను నివారించడం కోసం అమెరికా ఆయా దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుండటంతో.. దీనిని వ్యతిరేకిస్తూ పలు మిలిటెంట్ గ్రూపులు ఇరాక్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేశాయి. అమెరికా సైనికులపై దాడులు ఆగాలంటే గాజాలో ఇజ్రాయెల్ దాడుల్ని ఆపాలని అమెరికాను హెజ్‌బొల్లా గ్రూప్ డిమాండ్ చేసింది.