పాకిస్తాన్ కోరికను నెరవేర్చాడు డోనాల్డ్ ట్రంప్. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)ని విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా అమెరికా అధికారికంగా ప్రకటించింది. BLA అనుబంధ సంస్థ ‘ది మజీద్ బ్రిగేడ్’ ను కూడా ఈ జాబితాలో చేర్చారు. బలూచ్ తిరుగుబాటుదారులపై ప్రపంచ స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేసిన విజ్ఞప్తి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
Also Read:Story Board : బంగారం పెరుగుదలకు కారణం అదేనా..?
ఉగ్రవాదంపై పోరాటం పట్ల అమెరికా ప్రభుత్వం నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని సోమవారం (ఆగస్టు 11, 2025) అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. 2019లో BLAను “స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్” (SDGT) జాబితాలో మొదటిసారి చేర్చారని, అయితే దీని తరువాత కూడా, ఆ సంస్థ, దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్ అనేక పెద్ద దాడులకు బాధ్యత వహించాయని ఆయన తెలిపారు. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించడం వారి ఆర్థిక, నెట్‌వర్క్ సపోర్టును అంతం చేయడానికి ఒక ప్రభావవంతమైన మార్గం అని మార్కో రూబియో తెలిపారు.
Also Read:Chairman’s Desk : విభజన జరిగి పదకొండేళ్లైనా ఏపీకి ఆవేదనే మిగిలిందా?
అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం, 2024లో, BLA కరాచీ విమానాశ్రయం, గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ సమీపంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. అదే సమయంలో, మార్చి 2025లో, ఈ సంస్థ క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ రైలును హైజాక్ చేసి 31 మందిని చంపి, 300 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకుంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో గత కొన్ని దశాబ్దాలుగా BLA హింసాత్మక వేర్పాటువాద ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రాంతంలోని ఖనిజ వనరులను దోపిడీ చేస్తోందని, స్థానిక బలూచ్ సమాజంపై వివక్ష చూపుతోందని ఆ సంస్థ ఆరోపిస్తోంది. యూఎస్, పాకిస్తాన్ రెండూ ఇప్పటికే BLAని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.
