Ursula von der Leyen: యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, భారత 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ‘‘విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా చేస్తుంది’’ అని అన్నారు. 27 దేశాల యూరోపియన్ యూనియన్(ఈయూ) కూటమి-భారత్ మధ్య జరిగే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఈయూ చీఫ్, తాను భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడాన్ని ‘‘జీవితకాల గౌరవం’’గా భావిస్తున్నానని చెప్పారు. ఆమెతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం ఆమె ప్రధాని నరేంద్రమోడీతో శిఖరాగ్ర చర్చలు జరపనున్నారు.
భారతదేశం-EU వాణిజ్య ఒప్పందం:
భారత్, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) కోసం ఇరు పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత పర్యటనకు ముందు.. ఆమె మాట్లాడుతూ, భారత్-ఈయూలు ‘చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం’ అంచున ఉన్నాయని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు పావు వంతు వాటాను కలిగి ఉన్న రెండు బిలియన్ల ప్రజల మార్కెట్లను సృష్టిస్తుందని అన్నారు. గత మంగళవారం ఆమె దావోస్ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఈ ఒప్పందాన్ని ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా అభివర్ణించారు.
యూరోపియన్ యూనియన్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం 135 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈయూ, భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కో్సం చర్చలు మొదటగా 2007లో ప్రారంభమయ్యాయి, 2013లో చర్చల నిలిచిపోయాయి, 2022లో చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈయూ నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలు 110 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని భారత్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ తో వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్ మరియు బీఎండబ్ల్యూ వంటి యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారులకు భారత మార్కెట్‌లోకి ప్రవేశాన్ని సులభతరం అవుతుంది. ఇదే విధంగా భారత ఉత్పత్తుల్ని ఈయూ మార్కెట్‌లోకి తీసుకెళ్లవచ్చు.
