NTV Telugu Site icon

UPSC Civil Services Exam: సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామ్‌కు అప్లై చేశారా.. గంటలే గడువు!

Upsc

Upsc

UPSC Civil Services Exam: యూనియన్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే సివిల్ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌-2023 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. 1,105 సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 1 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఇవాళ(మంగళవారం) సాయంత్రం 6గంటలతో దరఖాస్తుల గడువు పూర్తికానుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందినవారు, ప్రస్తుతం డిగ్రీ ఆఖరి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయో పరిమితి 2023 ఆగస్టు 1 నాటికి 21 ఏళ్లు నిండి 32 ఏళ్ల మధ్య ఉండాలని యూపీఎస్సీ వెల్లడించింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్ష మే 28న జరగనుంది. ఆ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ప్రతిభ కనబరిచిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానించి అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడిస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్షకు మూడు వారాల ముందు ఈ-అడ్మిట్‌ కార్డులను జారీ చేయనున్నారు.

IAS vs IPS: సివిల్ సర్వెంట్లు రోహిణి, రూప బదిలీ.. పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం..

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) తప్పనిసరి. దీన్ని ఒకే ఒక్కసారి చేస్తే భవిష్యత్తులోనూ ఉపయోగపడుతుంది. మొదట ఓటీఆర్‌ చేసుకుని, ఆపై ఆన్‌లైన్‌ దరఖాస్తును నింపి పంపాలి. ఇంతకుముందే ఓటీఆర్‌ పూర్తి చేసుకుంటే నేరుగా దరఖాస్తులో వివరాలు నమోదు చేసి, పంపుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షకు చేసే దరఖాస్తులోనే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలను ఎంచుకోవాలి. తర్వాత వీటిని మార్చటానికి వీలుండదు.మెయిన్స్ పరీక్షలో ఆప్షనల్ సబ్జెక్టు ఉంటుంది. దాన్ని ఎంచుకోవటం మాత్రం ప్రిలిమినరీ దరఖాస్తులోనే చేయాలి. అందుకని ఆప్షనల్‌ సబ్జెక్టు విషయంలో ఇప్పుడే స్పష్టత ఏర్పరచుకోవాలి. ప్రిలిమినరీ దరఖాస్తు నింపేటప్పుడే మెయిన్స్‌ రాసే మీడియంను ఎంచుకోవడం మాత్రం మరిచిపోవద్దు. ఎందుకంటే దాన్ని తర్వాత మార్చుకోవడం సాధ్యం కాదు.