వినియోగదారులకు UPI సేవలను ఉచితంగానే కొనసాగిస్తూ, ఎంపిక చేసిన వ్యాపారి లావాదేవీలపై సవరించిన UPI మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని 2026 అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్నారు. రూ.2,000లోపు జరిగే తక్కువ విలువ కలిగిన UPI లావాదేవీల్లో 95 శాతం, అలాగే చిన్న వ్యాపారుల లావాదేవీలు (P2PM) పూర్తిగా ఉచితంగానే ఉంటాయి. చిన్న వ్యాపారుల్లో UPI వినియోగాన్ని విస్తరించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు.
ఈ చర్య ద్వారా UPI వినియోగాన్ని మరింత విస్తరించడం, నిరంతర వినియోగాన్ని ప్రోత్సహించడం, భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో చిన్న వ్యాపారాలను వేగంగా భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అధిక విలువ కలిగిన లావాదేవీలపై విధించే MDR ఛార్జీని UPI వ్యవస్థలోని వివిధ భాగస్వాముల మధ్య పంపిణీ చేయడం ద్వారా కొత్త వినియోగదారులు, వ్యాపారులకు UPI విస్తరణతో పాటు సైబర్ సెక్యూరిటీ, సాంకేతికత, ఆవిష్కరణలపై పెట్టుబడులకు అవకాశం కల్పించనున్నారు.
MDR విధానం..
వినియోగదారులు ఇప్పటివరకు మాదిరిగానే UPI ద్వారా ఉచితంగా లావాదేవీలు కొనసాగించవచ్చు. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P), వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) జరిగే రూ.2,000 వరకు లావాదేవీలపై MDR వర్తించదు. P2PM విధానంలో ఉన్న చిన్న వ్యాపారులకు జీరో MDR కొనసాగుతుంది. UPI QR చెల్లింపుల ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి పొందే చిన్న వ్యాపారులకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని మరింత పెంచేందుకు చిన్న వ్యాపారుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఉన్న వ్యాపారులు, అలాగే టైర్-3 , అంతకంటే చిన్న మార్కెట్లలో డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులకు ఈ నిధి సహాయపడుతుంది.
రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధనం వంటి నిర్దిష్ట వ్యాపార విభాగాల్లో రూ.2,000కు మించిన UPI చెల్లింపులపై ప్రతి లావాదేవీకి రూ.5 ఫ్లాట్ MDR వర్తిస్తుంది. రూ.2,000కు మించిన P2M UPI లావాదేవీలపై 0.4 శాతం MDR విధించబడుతుంది. అయితే ప్రతి లావాదేవీకి MDR గరిష్ఠంగా రూ.300కు పరిమితం చేస్తారు.
అన్ని వ్యాపారుల వద్ద రూ.2,000 వరకు జరిగే చిన్న మొత్తాల UPI లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇవి మొత్తం UPI P2M లావాదేవీల్లో 95 శాతానికి పైగా ఉన్నాయి. సవరించిన UPI MDR, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వాలెట్లతో సహా ఇతర డిజిటల్ చెల్లింపు సాధనాల ఛార్జీలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది.

