Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!

Upcoming Smartphones

Upcoming Smartphones

Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ నెల ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. ఈ నెల మొదటి వారంలో Motorola Signature 27 గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కాగా.. రెండో వారంలో ఒప్పో నుండి కొత్త Reno 17 సిరీస్‌ను తీసుకొస్తోంది. నవంబర్ 9న చైనాలో Oppo Reno 17, Reno 17 Pro స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ రెండు ఫోన్లలో భారీ బ్యాటరీలు, 200MP కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్లు ఉండనున్నట్లు లీకులు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ నెల చివరి నాటికి షియోమీ, వివో, మోటోరోలా వంటి బ్రాండ్ల నుంచి కూడా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.

Oppo Reno 17 సిరీస్

ఒప్పో రెనో 17 సిరీస్ చైనాలో నవంబర్ 9న అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన బ్లైండ్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్‌లో స్టాండర్డ్ Reno 17, Reno 17 Pro మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. డిజైన్ పరంగా Reno 17 ఫోన్ కెమెరా మాడ్యూల్ గత మోడల్ Reno 16 తరహాలోనే ఉండనుంది. అయితే వెనుకవైపు నీలిరంగు కాంతిలో మెరిసే పిల్లి ఆకారపు ప్రత్యేక ఎఫెక్ట్ ఆకట్టుకోనుంది. ఇది ‘Encounter Cat’ స్పెషల్ ఎడిషన్‌లో భాగమని ప్రచారం జరుగుతోంది. స్నో వైట్, ఐస్ మూన్ వైట్, కకాయా బ్రౌన్, స్టార్ లైట్ పింక్ కలర్ ఆప్షన్లలోనూ ఈ ఫోన్లు వచ్చే అవకాశం ఉంది.

ఒప్పో రెనో 17 స్మార్ట్‌ఫోన్‌లో 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉండనున్నట్లు సమాచారం. ఇది Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ముఖ్యంగా ఇందులో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని అందించనున్నట్లు లీకులు చెబుతున్నాయి. కెమెరాల విషయానికి వస్తే.. 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనున్నాయి. గరిష్ఠంగా 12GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

రెనో 17 ప్రో మోడల్ స్టాండర్డ్ వెర్షన్ కంటే కాస్త కాంపాక్ట్ డిజైన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 6.32 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే అందించనున్నారు. మీడియాటెక్ డిమెంసిటీ 8550 సూపర్ ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 7,200mAh బ్యాటరీ ఉండనుంది. కెమెరాల పరంగా స్టాండర్డ్ మోడల్ తరహాలోనే 200MP మెయిన్, 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను అందించనున్నట్లు సమాచారం. ఈ రెండు ఫోన్లు Android 17 ఆధారిత ColorOS 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనున్నాయి. ఒప్పో రెనో 17 సిరీస్ చైనా లాంచ్ తేదీని ప్రకటించినప్పటికీ.. భారత మార్కెట్లో విడుదలపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ సమాచారం ప్రకారం.. స్టాండర్డ్ Reno 17 మోడల్ 2027 ప్రారంభంలో భారత్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే రెనో 17 ప్రో మాత్రం భారత మార్కెట్లో లాంచ్ కాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.

Motorola Signature 27:

ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్‌ను నవంబర్‌లో భారత మార్కెట్లోకి తీసుకురావడానికి మోటోరోలా సిద్ధమవుతోంది. మోటోరోలా ఇండియా మైక్రోసైట్‌లోనూ ఈ నెలలో లాంచ్ కానున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కచ్చితమైన తేదీని కంపెనీ ప్రకటించాల్సి ఉంది.

Xiaomi 18 Pro సిరీస్:

షియోమీ 18 Pro సిరీస్‌ను ఈ నవంబర్‌లో గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ధ్రువీకరించింది. Xiaomi 18 ప్రో భారత లాంచ్ కూడా ఇప్పటికే ఖరారైంది. గ్లోబల్ లాంచ్ తర్వాత త్వరలోనే భారత్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే Xiaomi 18 Pro Max భారత విడుదలపై ఇంకా స్పష్టత లేదు.

Vivo X500 సిరీస్:

Vivo X500 సిరీస్ భారత లాంచ్‌ను కంపెనీ ఇటీవల ధ్రువీకరించింది. నవంబర్ చివరి వారంలో ఈ ఫోన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో Vivo X500, Vivo X500 Pro, Vivo X500 Pro Max మోడళ్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Honor 700 సిరీస్:

చైనా మార్కెట్లో ఈ నెలలో హానర్ 700 సిరీస్‌ను పరిచయం చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇందులో స్టాండర్డ్ హానర్ 700 ఫోన్ Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌తో, హానర్ 700 ప్రో మోడల్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో రానున్నట్లు లీకులు వెల్లడిస్తున్నాయి.

Wobble Speed 5G:

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో Wobble Speed 5G కూడా ఈ నెలలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ ఈ ఫోన్‌ను టీజ్ చేసింది.