NTV Telugu Site icon

UP: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బ్యూటీ పార్లర్‌లో వధువు హత్య

Bride

Bride

మరికొద్దిసేపట్లో భర్తతో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆ వధువు సిద్ధమవుతోంది. పెళ్లి పీటలెక్కి కాబోయే భర్తతో మెడలో మూడు ముళ్లు వేసేకునేందుకు రెడీ అవుతోంది. ఎన్నో కలలు.. ఎన్నో ఊహలు.. స్నేహితులు, బంధువులు.. ఇలా ఇళ్లంతా.. మండపం అంతా సందడి సందడిగా ఉంది. ఇంకేముంది కాబోయే భర్తతో సంతోషంగా జీవితం సాగించాలని ఆ పెళ్లి కూతురు ఊహల్లో విహరిస్తోంది. కానీ తన వెన్నంటే మృత్యువు వెంటాడుతోందని ఏ మాత్రం గ్రహించలేకపోయింది. సహజంగా పెళ్లి కూతురు అంటేనే అలంకరణ. ఎంతో అందంగా వధువును సిద్ధం చేస్తుంటారు. పెళ్లి మండపంలో అందంగా కనిపించాలని కుటుంబ సభ్యులు భావిస్తుంటారు. మరింత కలర్‌ఫుల్‌గా తయారయ్యేందుకు తన స్నేహితురాండ్రతో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. కానీ అక్కడే మృత్యువు కాపు కాసింది. ఓ దుర్మార్గుడు తుపాకీతో వధువుపై కాల్పులు జరపగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న బంధువులు, స్నేహితులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అందరూ విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన యూపీలోని ఝాన్సీలో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లా సోనగిరిలోని బార్‌గావ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల కాజల్‌కు.. యూపీలోని ఝాన్సీ గ్రామానికి చెందిన రాజ్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అయితే వివాహం కోసం కాజల్, ఆమె స్నేహితులు, బంధువులంతా ఝాన్సీ గ్రామానికి వచ్చారు. అప్పటికే నిషా గర్డెన్ కల్యాణ్ మండపంలో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే పెళ్లి మండపంలోకి వెళ్లే ముందు తన స్నేహితులతో కలిసి కాజల్.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. లోపల మేకప్ వేసుకుంటుండగా.. దీపక్ అనే యువకుడు.. కాజల్‌ను బయటకు రావాలని పిలిచాడు. తనను మోసం చేశావంటూ బెదిరించాడు. కానీ కాజల్ మాత్రం బయటకు వచ్చేందుకు నిరాకరించింది. దీంతో దీపక్.. బ్యూటీ పార్లర్‌లోకి ప్రవేశించి కాజల్‌పై సెకన్ల వ్యవధిలోనే తుపాకీతో కాల్పులు జరపగా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో స్నేహితులంతా భయాందోళనతో షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

కాజల్ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు పార్లర్ సిబ్బంది, కాజల్ స్నేహితులు, సోదరి నేహా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకుని కాజల్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. పోలీసుల విచారణలో నిందితుడికి బాధితురాలితో పరిచయం ఉందని.. కాజల్, దీపక్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.