Site icon NTV Telugu

Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

Up

Up

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి కథ ఇది. తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన భార్యను ఆమె ప్రియుడితో వెళ్లడానికి అంగీకరించాడు. అసలేం జరిగిందంటే.. రాజ్‌కుమార్ భార్యకు వేరొకరితో సంబంధం ఉండేది. ఈ విషయంలో భర్తతో ఆమె తరచూ గొడవపడేది. గత ఏడాది జూలైలో.. తన ఆరు నెలల బిడ్డను కూడా వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ నిజానికి ఆమె తన ప్రియుడితో కలిసి ఉంటోందని రాజ్‌కుమార్ తెలుసుకున్నాడు. తాను ప్రశ్నించినప్పుడల్లా.. నేను అలా చేస్తున్నట్లు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా..? అని ప్రశ్నిస్తూ.. భర్తకు ఎదురు తిరిగి మాట్లాడేది. దీంతో అతడు ఏమి చేయలేక ఉండేవాడు.

ఫోన్‌లో షాకింగ్ విషయాలు..

ఇటీవల ఆమె తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా, రాజ్‌కుమార్ ఆ ఫోన్‌ను లాక్కున్నాడు. అందులో ఉన్న విషయాలు చూసి అతనికి వెన్నులో వణుకు పుట్టింది. ఫేస్‌బుక్‌లో హత్యలకు సంబంధించిన కథనాలు, కొన్ని ఫోటోలతో పాటు.. రాజ్‌కుమార్ ఫోటో కింద ‘నీలం రంగు డ్రమ్ మరియు సిమెంట్’ అని రాసి ఉండటాన్ని అతను గమనించాడు. తనను చంపి, డ్రమ్ములో పెట్టి సిమెంట్‌తో నింపేస్తారనే భయం అతనికి కలిగింది.

గతంలో జరిగిన దారుణం..

ఈ ‘నీలం డ్రమ్’ విషయం వినగానే అందరికీ 2025 మార్చిలో జరిగిన ఒక దారుణ హత్య గుర్తుకు వస్తుంది. అప్పట్లో ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపి… శరీరాన్ని ముక్కలుగా చేసి, ఒక నీలం డ్రమ్ములో వేసి సిమెంట్‌తో నింపేసింది. సరిగ్గా తన భార్య కూడా తనను అలాగే బెదిరించేదని రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

రాజ్‌కుమార్ భార్య ఇంట్లో పనులు చేసేది కాదు.. కనీసం చిన్న బిడ్డను కూడా పట్టించుకునేది కాదు. తనను.. తన తమ్ముళ్లను చంపేస్తానని బెదిరించేది. చివరికి రాజ్‌కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్‌లో రాజీ ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా.. ఆమె తన ప్రియుడితోనే ఉంటానని ఖరాఖండిగా చెప్పింది. దీంతో రాజ్‌కుమార్ తన భార్య ప్రియుడిని పిలిపించి.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమెను అతనితో వెళ్లడానికి అనుమతించాడు.

 

Exit mobile version