Imran: ‘మేము బిచ్చగాళ్లం కాదు’.. ఎస్పీ సీట్ల ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్..

Imran Masood

Imran Masood

2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ మధ్య జరుగుతున్న సీట్ల పంపకాల చర్చల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ప్రాథమికంగా 26 సీట్లు కేటాయిస్తామని ఎస్పీ ఏకపక్షంగా ప్రకటించడంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ బుధవారం తీవ్రంగా మండిపడ్డారు. తాము బిచ్చగాళ్లం కాదని, 26 సీట్లు ఇవ్వమని తాము ఎవరినీ అడగలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో కూటమి సమావేశాలు జరిగిన తర్వాత ఇలా ఏకపక్షంగా సీట్లు ప్రకటించడం పొత్తు ధర్మానికి విరుద్ధమని, ఇది కూటమి పట్ల ఎస్పీకి ఉన్న చిత్తశుద్ధి లోపాన్ని చూపిస్తోందని మసూద్ విమర్శించారు.

బీజేపీని ఓడించడమే ఇండియా (INDIA) కూటమి ప్రధాన లక్ష్యమని, దేశంలో బీజేపీని ఓడించే సత్తా రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని అన్నారు. అంతర్గత సమావేశాల్లో చర్చించాల్సిన విషయాలను సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రకటించడం సరికాదని ఆక్షేపించారు. తనకు పట్టు ఉన్న సహారన్‌పూర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిని ప్రకటించడంపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. 2022 ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీకి 35 సీట్లు ఇచ్చిన ఎస్పీ, ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లతో మొదలుపెట్టడం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తల అస్తిత్వానికి తాను అండగా ఉంటానని, తదుపరి కార్యాచరణపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని మసూద్ తెలిపారు.

ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో కాంగ్రెస్ 120 సీట్లు డిమాండ్ చేస్తుండగా, ఎస్పీ 26 సీట్లను ప్రతిపాదించింది. మరోవైపు, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సూచిస్తూ, తొలి విడతగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. అయితే, ఇరు పార్టీల మధ్య పొత్తు ఇంకా చెక్కుచెదరలేదని, నవంబర్ 27న జరగనున్న తదుపరి సమావేశంలో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు యూపీలో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల పొత్తు కీలకంగా మారింది.