UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి

Up 2027 Assembly Elections

Up 2027 Assembly Elections

UP 2027 Elections: 2024 లోక్‌సభ ఎన్నికల పొత్తును కొనసాగిస్తూ, ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ పర్యటన సందర్భంగా ఎస్పీ నాయకులతో చర్చలు జరిపినప్పటికీ, ప్రధానంగా రాయ్‌బరేలీ, అమేథీ అసెంబ్లీ స్థానాల విషయంలో స్పష్టత రాక ఈ చర్చలు కొలిక్కి రాలేదు. తనకు 6 లోక్‌సభ స్థానాలు ఉన్న ప్రాంత పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతుండగా, ఎస్పీ మాత్రం పరిమిత సీట్ల ఫార్ములాను ప్రతిపాదించింది. ఎస్పీ మొత్తం 86 సీట్లను ఆఫర్ చేయగా, కాంగ్రెస్ 105 నుంచి 115 సీట్లు కావాలని కోరుతోంది. దీంతో ఇరు పార్టీల మధ్య దాదాపు 20 నుంచి 30 సీట్ల విషయంలో వ్యత్యాసం నెలకొంది.

యుపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలను ప్రాతిపదికగా తీసుకుని ఎస్పీ తన సీట్ల పంపిణీ ఫార్ములాను రూపొందించింది. కాంగ్రెస్ గెలిచిన 6 లోక్‌సభ స్థానాల పరిధిలో ప్రతిచోటా 2 అసెంబ్లీ సీట్లు (6 x 2 = 12), మిగిలిన 74 లోక్‌సభ స్థానాల పరిధిలో ఒక్కో అసెంబ్లీ సీటు చొప్పున మొత్తం 86 స్థానాలను (74 + 12) కాంగ్రెస్‌కు కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే, కాంగ్రెస్ మాత్రం యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో పెద్ద జిల్లాలు, కీలక నియోజకవర్గాలను కలుపుకొని 100కి పైగా సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది.

ఇక, గాంధీ కుటుంబానికి అడ్డాగా పరిగణించే రాయ్‌బరేలీ, అమేథీ జిల్లాల్లో సీట్ల పంపిణీ ప్రధాన ప్రతిబంధకంగా మారింది. అక్కడ తమకు సాంప్రదాయ బలం ఉన్నందున ఏ స్థానాన్ని ఎస్పీకి వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. మరోవైపు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌బరేలీలోని ఊంచాహార్, హర్‌చంద్‌పూర్, బచ్‌రావా, సరేనీ స్థానాలతో పాటు అమేథీలోని గౌరీగంజ్, అమేథీ స్థానాలను ఎస్పీ గెలుచుకుంది. ఈ ప్రాంతాల్లో తాను గెలిచిన సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఎస్పీ సుముఖంగా లేదు.

ఈ సీట్లలో ఎస్పీ పట్టుబట్టడానికి మరో కారణం రెబెల్ ఎమ్మెల్యేలపై ఉన్న రాజకీయ వ్యూహం. ఊంచాహార్‌ ఎస్పీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ పాండే, హర్‌చంద్‌పూర్ ఎమ్మెల్యే రాహుల్ లోధి, గౌరీగంజ్ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ బీజేపీకి చేరువకావడంతో వారిని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ఎస్పీ భావిస్తోంది. అలాగే అమేథీ స్థానంలో గాయత్రీ ప్రజాపతి కుటుంబానికి మంచి రాజకీయ ప్రాబల్యం ఉండటంతో ఆ సీటును కూడా తన వద్దే ఉంచుకోవాలని ఎస్పీ పట్టుబడుతోంది. ప్రస్తుతానికి ఎస్పీ 80 నుంచి 86 సీట్లు ఇవ్వాలని భావిస్తుండగా, కాంగ్రెస్ 105 నుంచి 115 సీట్లు డిమాండ్ చేస్తోంది. అయితే రెండు పార్టీలు చర్చలు జరిపి మధ్యేమార్గంగా ఒక నిర్ణయానికి వస్తే, చివరికి కాంగ్రెస్‌కు లభించే సీట్ల సంఖ్య 90 నుండి 95 మధ్య ముగిసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.