Rajnath Singh: “దీపం ఐక్యతకు చిహ్నం.. ఆ ఐక్యతే మనకు బలం.. మనలో ఆ ఐక్యత కొనసాగాలని ఆశిస్తూ.. అలాగే ఈ కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది.. ఇటువంటి దీపోత్సవాల ద్వారా ప్రతి ఇల్లు ఒక ఇల్లు దేవాలయం కావాలి.. జ్ఞానసంపదకు క్షేత్రం కావాలి” అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోటి దీపోత్సవానికి హాజరై ప్రసంగించారు. కోటి దీపోత్సవ ప్రాంగణంలో మొదటి కార్తీక దీపాన్ని రాజ్‌నాథ్ సింగ్ వెలిగించారు. అంతకు ముందు కాశీ విశ్వనాథుడికి ఆయన పూజలు చేశారు.
రక్షణ మంత్రిగా దేశ సరిహద్దులు కాపాడటం నా బాధ్యత అన్న రాజ్‌నాథ్ సింగ్.. దేశ సరిహద్దును కాపాడటం ఎంత అవసరమో.. దేశంలో సంస్కృతిని కాపాడటం కూడా అంతే అవసరమన్నారు. ఆ పనిని ‘భక్తి’ టీవీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కోటి దీపోత్సవం దేశంలోనే ఒక భవ్య మహోత్సవమని అన్నారు. కోటి దీపోత్సవం వల్ల ఈ భారతదేశం ప్రకాశమంతమవుతుందన్నారు. తాను ఎక్కడా ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని చూడలేదన్నారు.