కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఏపీలోని గోదావరి జిల్లాల్లో పర్యటించారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద గతంలో నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైనవాని లంకను దత్తత తీసుకున్నారు. అయితే.. దత్తత గ్రామ సందర్శన కోసం నిర్మలా ఏపీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పెదమైనవాని లంకలో ఏర్పాటు చేసిన డిజిటల్ కమ్యూనిటి సెంటర్ ను ఆమె సందర్శించనున్నారు. తన దత్తత గ్రామ సందర్శనకు ముందు ఆమె జిల్లాలోని మత్స్యపురం గ్రామాన్ని కూడా సందర్శించారు. ఈ క్రమంలోనే.. గోదావరి జిల్లాల్లో తాగునీరు లేకపోవడంపై నిర్మలా సీతారామన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురం గ్రామంలో రక్షిత తాగునీటి పథకాన్ని ఆమె ప్రారంభించారు.
Also Read : Proteins : పోషకాల లోపాన్ని ఇలా కనిపెట్టండి.. లేకుంటే కష్టామే..!
సమీప గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడం పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆరేళ్ల క్రితమే సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేశామని.. ఇప్పటికీ మంచినీటి సౌకర్యం కల్పించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మత్స్య గ్రామంలో ఏర్పాటు చేసినట్టు మిగతా ఆరు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించక పోవడం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎదుటే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను నిలదీయాలని ప్రజలకు సూచించారు.