NTV Telugu Site icon

Polavaram: పోలవరం నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

Polavaram

Polavaram

ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా.. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం సహా పనుల వేగం పెంచేందుకు తొలిదశ ప్యాకేజీ నిధులు ప్రకటించింది. ప్రస్తుత పనులు చేపడుతోన్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించేందుకు అంగీకారం తెలిపింది.

Read Also: Viral Video: విమానంలో బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన యువతి.. వీడియో వైరల్

మరోవైపు.. పోలవరం నిధుల విడుదలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో రెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం వల్లనే సాధ్యమైందని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమైందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విషయంలో ఏపీకి కేంద్రం ఎంతో సహకరిస్తోందన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకరిస్తోందని.. కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Read Also: Bolisetti Srinivas: అల్లు అర్జున్ కు, మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు!

ఇదిలా ఉంటే.. పోలవరం పెండింగ్ నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు కేంద్ర మంత్రులని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రధాన మంత్రి కార్యాయం ఆదేశాల మేరకు ఆర్థికశాఖ పోలవరం నిధుల విషయాన్ని మంత్రిమండలి ముందు ఉంచింది. ఈ క్రమంలో.. కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడంతో నిధులు విడుదల కానున్నాయి. మరోవైపు.. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి రూ.15 వేల కోట్లను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.