Union Cabinet Decisions: ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మూడు ప్రధాన నిర్ణయాలలో ఒకటి జనాభా లెక్కలకు సంబంధించినదిగా వెల్లడించారు. జనాభా లెక్కల తేదీని మార్చి 1, 2027న నిర్ణయించారు. ఈ జనాభా లెక్కలను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది, రెండవ దశ ఫిబ్రవరి 2027లో ముగుస్తుంది. అలాగే కోల్ బ్రిడ్జి ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు.
READ ALSO: CM Chandrababu Delhi visit: మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు
2027 జనాభా లెక్కలు దేశంలోనే తొలి డిజిటల్ జనాభా లెక్కలు అవుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీని కోసం కేంద్రం రూ.11,718 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించిందని తెలిపారు. ఈ జనాభా లెక్కల్లో ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే ఇందులో కుల ఆధారిత జనాభా లెక్కలు ఉంటాయని అన్నారు. అలాగే బొగ్గు సేతు పథకం కింద విస్తృత భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రమాణాలను ఆమోదించిందని వెల్లడించారు. వ్యాపారులు కాకుండా ఏ వినియోగదారుడైనా ఇప్పుడు బొగ్గు వినియోగంపై ఎటువంటి పరిమితులు లేకుండా ఈ పథకంలో పాల్గొనడానికి అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. అదనంగా లింకేజ్ హోల్డర్లు వారి సామర్థ్యంలో 50% వరకు ఎగుమతి చేయడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అయితే కోకింగ్ బొగ్గు ఎగుమతి అనుమతి లేదని స్పష్టం చేశారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చినట్లు తెలిపారు. ఇకపై ఉపాధి హామీ పథకం పేరు పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అలాగే ఈ పథకంలో ఉపాధి హామీ కార్మికుల పని దినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచిందని, ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి సవరించిందని తెలిపారు. అలాగే కేంద్ర కేబినెట్ బీమా రంగంలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు కూడా ఆమోదం తెలిపిందని అన్నారు. ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతిస్తే, విదేశీ సంస్థలు భారతీయ కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగా పనిచేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని, దీనివల్ల ఈ రంగానికి మేలు జరిగే అవకాశాలున్నాయని కేంద్రం ఆలోచిస్తుంది.
READ ALSO: Khammam: ఎన్నికల్లో ఓటమి.. సెల్ టవర్ ఎక్కి నిరసన..!
