Site icon NTV Telugu

ఎంపీ ల్యాడ్స్‌పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ ల్యాడ్స్‌ను పునరుద్ధరించింది. ఈ ఏడాది నుంచే దీనిని అమలు చేయనుంది మోడీ సర్కార్‌. తమ నిజయోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పార్లమెంట్‌ సభ్యులకు అవకాశం రాబోతోంది. మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ – ఎంపీ ల్యాడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించడమే దీనికి కారణం. కరోనా కారణంగా ఎంపీ ల్యాడ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే… ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిస్థితులు చక్కబడుతుండడంతో… ఎంపీ ల్యాడ్స్‌ను పునరుద్ధరించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన కాలానికి నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి 2 కోట్ల రూపాయల చొప్పున ఎంపీ ల్యాడ్స్‌ కింద ఏకమొత్తంలో నిధులు అందనున్నాయి. 2026 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎంపీ ల్యాడ్స్‌ కింద ఏడాదికి 5 కోట్ల రూపాయల్ని ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. రెండున్న కోట్ల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఈ మొత్తాన్ని అందజేస్తోంది. కరోనా విజృంభణతో వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమయ్యాయి. దీంతో గతేడాది ఏప్రిల్‌లో ఎంపీ ల్యాడ్స్‌ను ఆపి… ఆ నిధులు వైద్య రంగం అవసరాలకు వినియోగించుకుంది కేంద్ర ప్రభుత్వం.

Exit mobile version