అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 208 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును అర్జున్ రాజ్‌పుత్ అద్భుతమైన శతకంతో ఆదుకున్నాడు. అర్జున్ కేవలం 85 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆయనతో పాటు చివరిలో కావ్యా ప్రసాద్ పటేల్ (23 పరుగులు) రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. పాక్ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్ షఫీక్ తలా మూడు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను దెబ్బతీశారు.
అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కూడా ప్రారంభంలో తడబడింది. భారత బౌలర్ మనాల్ చౌహాన్ ధాటికి పాక్ 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఆ సమయంలో హంజా జహూర్ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. అతనికి తోడుగా హస్నైన్ అబ్బాస్ (38 పరుగులు) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హంజా జహూర్ ఒంటరి పోరాటం చేస్తూ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఆడాడు. అజేయంగా 100 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరికి పాకిస్తాన్ 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో పాకిస్తాన్ గ్రూప్-ఏ లో అగ్రస్థానానికి చేరుకుంది. భారత జట్టు తరఫున అర్జున్ రాజ్‌పుత్ పోరాటం చేసినప్పటికీ, చివరికి పాక్ ఆటగాడు హంజా జహూర్ అజేయ శతకం ముందు ఆ ప్రయత్నం ఫలించలేదు. భారత బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా రాణించినా, మధ్యలో భాగస్వామ్యాన్ని విడదీయలేకపోవడంతో మ్యాచ్ చేజారిపోయింది. ఈ ఓటమితో భారత యువ జట్టు తీవ్ర నిరాశను చవిచూడాల్సి వచ్చింది.
ఈ విజయంపై పాకిస్తాన్ అండర్-19 జట్టు కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. టోర్నమెంట్లో తమకు రెండో విజయం దక్కడం పట్ల ఆటగాళ్లపై గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఆరంభంలో జట్టు తడబడినప్పటికీ, హంజా జహూర్ , హస్నైన్ డార్ అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్‌ను మలుపు తిప్పారని కొనియాడారు. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై కొద్దిగా తేమ ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేయడం కష్టమనిపించిందని, అయితే తాము ఆరంభంలోనే ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నామని తెలిపారు. హంజా జహూర్ ఆటతీరు గురించి మాట్లాడుతూ, అతడి ప్రతిభ తనకు ముందే తెలుసని, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని జట్టును గెలిపించిన తీరు ఎంతో అభినందనీయమని పాక్ కెప్టెన్ ప్రశంసించారు.

