Site icon NTV Telugu

IPL 2025: కేకేఆర్‌కు భారీ షాక్.. భారత స్పీడ్‌స్టర్ ఔట్!

Kkr

Kkr

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2025 మరో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ సమయంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)కు షాక్‌ తగిలింది. భారత స్పీడ్‌స్టర్ ఉమ్రాన్‌ మాలిక్‌ గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఉమ్రాన్‌ స్థానంలో భారత ఎడమచేతి వాటం పేసర్‌ చేతన్‌ సకారియాను కేకేఆర్‌ మేనేజ్మెంట్ జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో రాయల్‌ ఛాలెంజెర్స్‌ బెంగళూరుతో కోల్‌కతా తన మొదటి మ్యాచ్ ఆడనుంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో ఈ మ్యాచ్‌ జరగనుంది.

ఉమ్రాన్‌ మాలిక్‌ మొన్నటి వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌లో ఉన్నాడు. ఉమ్రాన్‌ తన స్పీడ్‌ బౌలింగ్‌తో అందరి దృష్టిలో పడ్డాడు. గంటకు 150 కిమీ వేగంతో బౌలింగ్ చేసి ఔరా అనిపించాడు. 2021 నుంచి 2024 వరకు 26 మ్యాచ్‌లలో 29 వికెట్స్ పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్‌ ఉమ్రాన్‌ను వదులుకుంది. వేలంలో కేకేఆర్‌ అతడిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ పేస్‌ సెన్సేషన్‌ గాయంతో ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో చేతన్‌ సకారియాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. తాజాగా ఉమ్రాన్‌ మాలిక్‌ గాయంతో వైదొలగడంతో.. సకారియాను కేకేఆర్‌ జట్టులోకి తీసుకుంది. గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్‌ జట్లకు సకారియా ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 19 మ్యాచ్‌లలో 20 వికెట్లు పడగొట్టాడు. సకారియా భారత్ తరఫున ఒక వన్డే, రెండు టీ20లు ఆడి రెండు వికెట్లు తీశాడు. అజింక్యా రహానె సారథ్యంలో సకారియా ఆడనున్నాడు.

Exit mobile version