NTV Telugu Site icon

Ukraine Crisis: యుద్ధం తీవ్రతరం.. అపార్ట్‌మెంట్‌పై రష్యా దాడిలో 40 మంది మృతి

Ukaine Crisis

Ukaine Crisis

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని నీప్రో నగరంలో ఓ అపార్టుమెంట్‌పై రష్యా శనివారం జరిపిన దాడిలో మృతుల సంఖ్య 40కి చేరింది. రష్యా క్షిపణి దాడితో నీప్రో నగరం విలవిలలాడడంతో ఉక్రెయిన్‌ పశ్చిమ దేశాలు వేగంగా ఆయుధాలను సరఫరా చేయాలని పట్టుబట్టింది. ఉక్రెయిన్‌ దళాలపై రష్యా ఒత్తిడిని పెంచినట్లు తెలుస్తోంది. నీప్రో నగరంలోని భవనంపై జరిగిన దాడిలో 40 మృతి చెందగా.. సహాయక సిబ్బంది బాధితులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ భవనంలో మొత్తం 1,700 మంది నివసిస్తున్నారు. ఈ దాడిలో మొత్తం 75 మంది గాయాలపాలయ్యారు.

నీప్రో నగరంలో శనివారం జరిగిన క్షిపణి దాడిలో మరణించిన వారి సంఖ్య ముగ్గురు పిల్లలతో సహా 40కి పెరిగిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 25 మంది తప్పిపోయారని లేదా ఆచూకీ తెలియలేదని, అయితే శిథిలాల నుంచి ఆరుగురు పిల్లలతో సహా 39 మందిని రక్షించారని వారు చెప్పారు. పౌరుల భవనాలను రష్యా సైన్యం లక్ష్యంగా చేసుకోదని ఈ ఘటనపై క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ చర్యలతోనే నీప్రో దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. మరోపక్క డోనెట్స్క్‌ రాష్ట్రంలో సోమవారం కూడా భీకర దాడులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వైపులా భారీగా సైనిక నష్టం జరిగిందని సైనిక నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం ఉక్రెయిన్ సైన్యం జనరల్ స్టాఫ్ మాట్లాడుతూ.. రష్యా ఫిరంగిదళాలు బఖ్‌ముట్, అవ్దికా చుట్టూ ఉన్న 25 పట్టణాలు, గ్రామాలను చుట్టుముట్టాయన్నారు. రష్యా సరిహద్దుకు సమీపంలోని ఈశాన్య ఖార్కివ్, సుమీ ప్రాంతాల్లో 30కి పైగా స్థావరాలపై రష్యా షెల్లింగ్‌ను కొనసాగించిందని ఉక్రెయిన్ పేర్కొంది.

Abdul Rehman Makki: అబ్దుల్‌ రెహ్మాన్‌ మక్కీ గ్లోబల్ టెర్రరిస్ట్.. ఐక్యరాజ్యసమితి ప్రకటన

ఇదిలా ఉండగా.. గత ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేశాయి. అయితే ప్రస్తుతం తమకు యుద్ధ ట్యాంకులు అవసరమని.. వాటిని వెంటనే సరఫరా చేయాలని ఉక్రెయిన్‌ పట్టుపడుతోంది. 14 ఛాలెంజర్లు, 2 ట్యాంకులు, వందలాది సాయుధ వాహనాలు, అధునాతన వాయు రక్షణ క్షిపణులతో సహా ఇతర ఆయుధాలను పంపబోతున్నట్లు బ్రిటన్ సోమవారం ధ్రువీకరించింది. ఈ యుద్ధం వల్ల ఎంతో మంది ఉక్రెయిన్‌ నుంచి వెళ్లిపోయారు. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌ నగరాలు, పట్టణాలు, గ్రామాలు శిథిలావస్థలో ఉన్నా.. రష్యా తన చర్యలను ప్రత్యేక సైనిక చర్య అని భావిస్తోంది. తూర్పు ఉక్రేనియన్ పట్టణం సోలెడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మాస్కో గత వారం పేర్కొంది. గత ఆగస్టు నుంచి రష్యా సాధించిన అతిపెద్ద విజయం ఇది. యుద్ధ తీవ్రతరం అవుతుండడంతో పాశ్చాత్య దేశాలు ఆయుధాల సరఫరాను పెంచాలని పట్టుపడుతోంది.