NTV Telugu Site icon

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంల ఉగాది శుభాకాంక్షలు !

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంలు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ ప్లవ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు సీఎం  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ సంతోషాలతో  కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలుగు వారికి, మొత్తం ప్రపంచానికి కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలని జగన్ ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని… ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఇక తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యతగా పంచాంగాలు చెబుతున్న నేపథ్యంలో.. తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమని అన్నారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధిగాంచిందన్నారు. ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఉగాది ఆహ్వానం పలుకుతుందని సీఎం తెలిపారు. వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లు ఉగాది నుంచి రైతు ప్రారంభిస్తారని,  రైతును  వ్యవసాయానికి సంసిద్ధం చేసే ఉగాది  రైతు జీవితంలో భాగమై పోయిందన్నారు. ప్రతి ఏటా చైత్రమాసంతో ప్రారంభమయ్యే ఉగాది పండుగ నాడు పచ్చడిని సేవించడం గొప్ప ఆచారమని సిఎం అన్నారు.