NTV Telugu Site icon

Udaya Bhanu : బుల్లితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న ఉదయభాను..

Whatsapp Image 2024 01 17 At 9.35.47 Pm

Whatsapp Image 2024 01 17 At 9.35.47 Pm

స్టార్ యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఆ తరువాత యాంకరింగ్ కు దూరమయ్యింది. అయితే ఈ భామ మరోసారి యాంకర్‌గా రీఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగులో జరిగిన ఒక ఈవెంట్‌లో తన పిల్లలతో కలిసి కనిపించారు ఉదయభాను. అదే ఈవెంట్‌ వేదికగా మళ్లీ యాంకరింగ్ మొదలుపెడతానని ఆమె ప్రకటించారు. జీ తెలుగులో ప్రసారం కానున్న ఒక షోతో మరోసారి హోస్ట్‌గా సందడి చేయనున్నారు.సూపర్ జోడీ’ అనే డ్యాన్స్ షో త్వరలోనే జీ తెలుగులో ప్రారంభం కానుంది. జనవరి 28న ప్రారంభమయ్యే ‘సూపర్ జోడీ’ ప్రతీ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ షోకు సీనియర్ హీరోయిన్ మీనా జడ్జిగా వ్యవహరిస్తుందని తెలిసేలా ఒక ప్రోమో విడుదలైంది.

”సోమవారం నుంచి శనివారం వరకు మా ఆడవాళ్లకు డైలీ సీరియల్‌లాగా ఇల్లు, పని.. సండే కూడా ఫన్ లేదు.. ఆడడానికి లేదు, చూడడానికి లేదు” అంటూ ఈ ప్రోమోలో మీనా.. తన లైఫ్ బోరింగ్ అయిపోయింది అన్నట్టుగా విసుగుకుంటుంది. అప్పుడే తనకు ‘ముత్తు’ సినిమా రెండు వందల రోజుల ఫంక్షన్‌కు సంబంధించిన అవార్డు కనిపిస్తుంది. దాన్ని చూస్తూ.. ”వినోదానికి గ్యాప్ ఉండొద్దు” అంటూ రజినీకాంత్ చెప్పిన మాటలను ఆమె గుర్తుచేసుకుంటుంది. అలా తనకు డ్యాన్స్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్టు అందులో 8 సెలబ్రిటీ జోడీలు ఉండనున్నట్టు ప్రకటిస్తుంది . ఇదిలా ఉండగా.. ఈ షోకు ఉదయభాను హోస్ట్ అని తెలిసేలా తాజాగా మరో ప్రోమో విడుదలైంది.”అమ్మ చెప్పేది అమ్మగా గెలిస్తేనే అన్నింటిలో గెలిచినట్టు అని. అమ్మను అయ్యాకే అమ్మ చెప్పింది గుర్తొచ్చింది. అన్నీ పక్కన పెట్టేశాను. పిల్లలే జీవితం అయిపోయాను” అంటూ ఉదయభాను తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్న మాటలతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. అదే సమయంలో ”ఆపొద్దు అమ్మ” అంటూ తన పిల్లలు చెప్పడంతో ‘సూపర్ జోడీ’తో యాంకర్‌గా రీఎంట్రీ ఇస్తున్నట్టుగా ఆమె ప్రకటించింది. ‘గోల్డెన్ లేడీ ఆఫ్ జీ తెలుగు ఈజ్ బ్యాక్’ అని ట్యాగ్‌తో ఉదయభాను ప్రోమోను జీ తెలుగు విడుదల చేసింది. సూపర్ జోడీ’ షోకు మీనాతో పాటు కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ మరియు మరో సీనియర్ నటీమణి శ్రీదేవి విజయ్ కుమార్ కూడా జడ్జిలుగా వ్యవహరించనున్నారు.