ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉబెర్ (Uber) సంస్థ ప్రతినిధుల బృందం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కీలక భేటీ నిర్వహించింది. ఈ సమావేశంలో ఉబెర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్, ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్, సీటీఓ ప్రవీణ్ నిప్పల్లి నాగ పాల్గొన్నారు. ప్రభుత్వ పక్షాన సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి కూడా ఈ చర్చల్లో భాగస్వాములయ్యారు.
తెలంగాణలో ఉబెర్ కార్యకలాపాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని సీఇవో ఖోస్రోషాహి స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ‘ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మరింత విస్తరిస్తున్నట్లు ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన మొట్టమొదటి సెంటర్ ఇదేనని, ప్రస్తుతం ఇక్కడ 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు.. హైదరాబాద్‌లో నిర్మించ తలపెట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి తమ సంస్థ ఆసక్తిగా ఉందని ప్రతినిధులు వెల్లడించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉబెర్ ప్రతినిధులకు ఒక వినూత్న సూచన చేశారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను ప్రస్తావిస్తూ, ఉబెర్ సంస్థ పార్కింగ్ వ్యాపారంలోకి వచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ‘మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లు’ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం సూచనపై సానుకూలంగా స్పందించిన ఉబెర్ ప్రతినిధులు, ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. ఉబెర్ సంస్థ వ్యాపార విస్తరణకు, పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
