అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా ఒమన్‌లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో పాకిస్తాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్ అర్జున్ రాజ్‌పుత్ సెంచరీతో మెరిసినప్పటికీ, పాకిస్తాన్ ఆటగాడు హంజా జహూర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆ విజయాన్ని నీరుగారుస్తూ పాక్‌ను గెలిపించాడు. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్‌కు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో ఆరంభంలోనే వికెట్లు పతనం కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని (0), ఆర్యవీర్ సెహ్వాగ్ (22), వి.కె. వినీత్ (8), యశ్వర్ధన్ చౌహాన్ (1) త్వరగానే పెవిలియన్ చేరడంతో 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన అర్జున్ రాజ్‌పుత్ అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. కేవలం 85 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 107 పరుగుల తూఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అన్వయ్ ద్రవిడ్ (10)తో కలిసి ఐదో వికెట్‌కు 44 పరుగులు, మనాలా చౌహాన్‌తో కలిసి ఆరో వికెట్‌కు 64 కీలక పరుగులు జోడించాడు. చివర్లో కావ్యా ప్రసాద్ పటేల్ (23), ఇషాన్ సూద్ (2) రాణించడంతో భారత్ గౌరవప్రదమైన 208 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్ షఫీక్ తలా మూడు వికెట్లు తీశారు.
అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరంభంలో తీవ్ర తడబాటుకు గురైంది. భారత బౌలర్ మనాల్ చౌహాన్ ధాటికి పాక్ 14.4 ఓవర్లలోపే 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు జహంగీర్ బిలాల్ (5), ఉస్మాన్ ఖాన్ (16), అబ్దుల్ ఖాదిర్ (20) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. భారత్ తరఫున మనాల్ చౌహాన్ 3, మోహిత్ ఉల్వా 2, ఇషాన్ సూద్, కావ్య పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ దశలో హంజా జహూర్ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి హస్నైన్ అబ్బాస్ (38) చక్కటి సహకారం అందించాడు. ఈ జోడి ఆరో వికెట్‌కు కీలకమైన 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. హంజా జహూర్ అద్భుత పరిణతితో ఆడి 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు సాధించాడు. చివరికి పాకిస్తాన్ 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఒక దశలో సులభంగా గెలుస్తుందనుకున్న భారత్, హంజా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఊహించని పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

