Sheep Distribution Scam: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు కీలక అధికారులను గొర్రెల స్కామ్‌లో అరెస్ట్ చేసింది. ఈ గొర్రెల పంపిణీ పథకంలో ఏకంగా రూ.2.10 కోట్ల అవినీతి జరిగిందని రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో నలుగురు ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి నుంచి సేకరించిన సమాచారంతో మరింత లోతైన దర్యాప్తు జరిపిన ఏసీబీ.. తాజాగా మరో ఇద్దరు కీలక అధికారులను పట్టుకుంది. తెలంగాణ పశుసంవర్ధకశాఖ సీఈఓ సబావత్ రామ్‌చందర్‌తో పాటు ఓఎస్‌డీ కళ్యాణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసింది. రూ.2.10 కోట్ల స్కామ్‌లో రామ్‌చందర్, కళ్యాణ్‌కుమార్ నిందితులుగా ఉన్నారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు రామ్‌చందర్, కళ్యాణ్‌కుమార్‌లను కోర్టులో హాజరుపరిచారు.
Read Also: TGSRTC: టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘునాథరావు పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు
ఇదిలా ఉండగా… ఫిబ్రవరిలో నలుగురు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. కామారెడ్డి వెటర్నరీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్‌లను ఏసీబీ అరెస్ట్ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించింది. గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి పాల్పడి.. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ బ్యాంక్ ఖాతాల్లోకి పథకం నిధులను తరలించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.
గొర్రెల పంపిణీ స్కామ్ లో భారీ ట్విస్ట్ వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీ స్కాం 700 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అనుమానిస్తోంది. రూ.700 కోట్ల రూపాయలు మొత్తం కూడా బ్రోకర్స్, అధికారులే పెద్ద ఎత్తున కొట్టేసారా అనే అనుమానం వ్యక్తం చేస్తు్న్నారు. స్కామ్‌లో కిందిస్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల పాత్రపై ఏసీబీ విచారణ జరుపుతోంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన స్కామ్‌ని వెలికితీయగా భారీ అవినీతి బయటపడింది. ఉన్నతాధికారుల పాత్రపై ఏసీబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తోంది.
