మలక్ పేట్ గంజ్ మిషన్ మార్కెట్లో ఒక భవనం టెర్రస్ పై బీహార్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి మొక్కలను పెంచుతూ శుక్రవారం హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందికి పట్టుబడ్డారు. మహబూబ్ మిషన్ మార్కెట్ భవనంలో కింద మొత్తం మార్కెట్ షాపులుగా ఉన్నాయి. పైన టెర్రస్ లో బీహార్ కు చెందినటువంటి లవకుశ, బీమ్లేష్ అనే ఇద్దరు అద్దెకు ఉంటున్నారు. టెర్రస్ పై గత ఆరు నెలలుగా గంజాయి మొక్కలను పెంచుతూ వాటిని ఏపుగా పెరిగిన అనంతరం గంజాయిగా మార్చి అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. టెర్రస్ పై గంజాయి మొక్కలు పెంచుతున్నారనే సమాచారం అందుకున్న హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది కలిసి టెర్రస్ పై దాడి నిర్వహించారు.
Also Read:Hyderabad: సోమాజిగూడ లోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం..
ఈ దాడిలో మూడు నుంచి 6 మీటర్ల ఎత్తులో పెరిగినటువంటి ఐదు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలతో పాటు 55 గ్రాముల ఎండు గంజాయి రెండు సెల్‌ఫోన్‌లతో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ గంజాయి చెట్ల నుంచి సుమారు 10 కిలో కేజీల గంజాయి దిగుబడిగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం అంచనాలు వేశారు. నిందితులను గంజాయి మొక్కలను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.
