యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో, ఏసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. 16 మందికి గాయాలయ్యాయి. ఆగ్రా అలీగఢ్ బైపాస్ రోడ్డులోని మాటై గ్రామ సమీపంలో ఈరోజు సాయంత్రం ప్రమాదం జరిగింది. బస్సు ఆగ్రా నుంచి డెహ్రాడూన్ వెళ్తున్నట్లు సమాచారం. ముందు వెళ్తున్న బొలెరోను బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంపై సీఎం యోగి దృష్టి సారించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో.. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చాలా అంబులెన్స్‌లు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నాయి. కాగా.. మరణించిన వారందరూ ఆగ్రాలోని ఖండౌలీ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.
బొలెరో వాహనంలో ఇరవై మందికి పైగా ప్రయాణికులతో ఆగ్రా నుండి అలీఘర్‌కు వెళుతున్నట్లు సమాచారం. ఆగ్రా అలీగఢ్ బైపాస్ రోడ్డులోని మాటై గ్రామ సమీపంలో వెనుక నుంచి వస్తున్న ఏసీ బస్సు గట్టిగా ఢీకొట్టింది. దీంతో.. అందులో కూర్చున్న ప్రయాణికులు నుజ్జు నుజ్జు అయ్యారు. మరోవైపు.. బస్సులో ఉన్న ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చూసి అటుగా వెళ్తున్న వాహనాలు, పాదచారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బొలెరోలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అప్పటికి కొంత మందికి గాయాలు కాగా, మరి కొందరు చనిపోయారు. ఈ ఘోర ప్రమాదం గురించి అధికారులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే.. ఘటనా స్థలానికి అధికారులు చేరుకునే సమయానికి 10 మంది చనిపోయి ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
West Bengal: అపరాజిత బిల్లును రాష్ట్రపతికి పంపించిన గవర్నర్ బోస్