తమిళనాడు రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. కొలత్తూరు నియోజకవర్గంలో డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన గత సెప్టెంబర్ 9న చెన్నై అమింజికరైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో, ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే వైద్య బృందం ఎంతగా ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఈ క్రమంలోనే నేడు మధ్యాహ్నం 2.24 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి.
వీఎస్ బాబు తన రాజకీయ ప్రస్థానాన్ని డీఎంకే పార్టీలో ఒక సాధారణ ఏరియా కార్యదర్శిగా ప్రారంభించి, ఉత్తర చెన్నై జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో పురసవాక్కం నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన కొలత్తూరు నియోజకవర్గంలో 2011లో స్టాలిన్ విజయం సాధించడంలో బాబు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2016లో అన్నాడీఎంకేలో చేరారు.
అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సమక్షంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలో చేరారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నుంచి టీవీకే తరఫున బరిలోకి దిగిన బాబు 82,997 ఓట్లు సాధించి, తన పాత నాయకుడు ఎంకే స్టాలిన్‌పై (74,202 ఓట్లు) 8,795 ఓట్ల మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించారు. బాబు మరణంతో తమిళనాడు అసెంబ్లీలో ఖాళీ అయిన స్థానాల సంఖ్య ఆరుకు చేరింది.

