TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..

Tvk1

Tvk1

TVK Vijay: తమిళనాడులో పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని రెండు గంటల పాటు పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ​చెన్నైలోని కోయంబేడు, కిలంబాక్కం బస్టాండ్లలో బస్సుల కోసం జనం క్యూలు కట్టినట్లు విజయ్ పేర్కొన్నారు. ​రవాణా శాఖ వైఫల్యంపై టీవీకే అధినేత విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ​వెంటనే ఎమర్జెన్సీ బస్సులు నడపాలని ఎన్నికల సంఘానికి విన్నవించారు. ​పోలింగ్ సమయాన్ని మరో 2 గంటల పాటు పొడిగించాలని డిమాండ్ చేశారు. ​రాత్రి 8 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ​ఓటు వేయడం రాజ్యాంగ హక్కు.. దానిని కాలరాయొద్దని హెచ్చరిక జారీ చేశారు. ​ఈసీ మూగప్రేక్షకుడిలా ఉండొద్దని విజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రణాళికాబద్ధంగా చేసిన కుట్రలా ఉందని విజయ్ తెలిపారు.

ఇదిలా ఉండగా.. తమిళనాడులో పోలింగ్ జాతర జోరుగా సాగుతోంది. ఓటింగ్ ప్రారంభం కాకముందే పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటలకు 17.69 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. వేసవి కాలం కావడంతో ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు ఉదయమే ఓటర్లు తరలివచ్చారు. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. తమిళనాడులో మొత్తం 324 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ మధ్యలో సమయాన్ని పొడిగించాలని టీవీకే అధినేత విజయ్ ఎన్నికల సంఘాన్ని కోరడం గమనార్హం.